Pages

Friday, February 20, 2015

ఎమ్బీయస్‌: నిర్మాత పదానికి నిర్వచనం- రామానాయుడు - 1

Published Date : 20-Feb-2015 13:58:51 GMT
రామానాయుడుగారికి ఘననివాళి లభించింది. ఆయనా, ఆయన వారసులు పరిశ్రమలో యింకా ప్రముఖులు కాబట్టే.. అనడానికి లేదు. ఆయన వలన మేలు కలిగినవారు ఎందరో వున్నారు. మంచిమనిషిగా, హుందాతనాన్ని కాపాడుకుంటూ చివరి వరకూ ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ లైమ్‌లైట్‌లోనే వున్నారు కాబట్టి అనుకోవాలి. ఆయన గురించిన విషయాలు చాలాకాలంగా అందరూ చెప్పుకునేవే. ఆయన జీవితచరిత్రలు వచ్చాయి. వ్యాసాలు వచ్చాయి, అనేక టీవీ యింటర్వ్యూలు వచ్చాయి. ఆయన ఏ విషయాన్నీ దాచుకోలేదు. తన బలమేమిటో, బలహీనత ఏమిటో, ఎప్పుడు ఏ సినిమాకు ఎంత ఖర్చు పెట్టారో, ఎంత వచ్చిందో, ఎంత పోయిందో, ఎక్కడ సక్సెసయారో, ఎందుకు బోర్లా పడ్డారో అన్ని వివరాలూ స్పష్టంగా చెప్పారు. మనం కొత్తగా చెప్పేదేమీ లేదు - కొన్ని పరిశీలనలు చేయడం తప్ప! 

ఈ రోజు ఆయనకు నీరాజనాలు అర్పించిన నిర్మాతలు రామానాయుడుగారి అంశ తమలో ఏ కొంచెమైనా వుందా లేదా అన్నది వారంతట వారే తరచి చూసుకోవాలి. రేపు మనం వెళ్లిపోయిన తర్వాత మన గురించి యిలా చెప్పుకుంటారా మరోలా చెప్పుకుంటారా అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఆయన రోజులు వేరు, మా రోజులు వేరు అనే వాదన నప్పదు. రామానాయుడు గారే చెప్తూ వుండేవారు - 'పరిస్థితులు ఏం మారాయి? సక్సెస్‌ రేటు ఎప్పుడూ పదిశాతమే అని. ప్రణాళికాబద్ధంగా వెళ్లినవారు నిలదొక్కుకున్నారు, లేనివారు లేదు' అని. ఆయన గొప్పతనం ఏమిటంటే - సినిమాను ఆయన వ్యాపారంగా చూశారు. చాలామంది దాన్ని జూదంగా చూస్తారు. వేరే చోట డబ్బు మిగిలితే యిక్కడ పెడదామని కొందరు, దీనిలో అర్జంటుగా గడించేసి వేరే చోట పెడదామని కొందరూ అనుకుంటారు. ఏ వ్యాపారానికైనా పెట్టుబడిదారుడు ముఖ్యం. ఎంత గొప్ప నటుడికైనా, దర్శకుడికైనా, రచయితకైనా, గాయకుడికైనా, కళాకారుడికైనా - తన ప్రతిభ చూపించాలంటే ఒక వేదిక కావాలి. అది కల్పించేవాడికి శక్తి, ఆసక్తి రెండూ వుండాలి. నిర్మాతకు టేస్టు లేకపోతే ఎంత గొప్ప సినిమాయైనా రూపొందదు. అందువలన నిర్మాతే తొలిగౌరవాన్ని అందుకోవాలి. కానీ సినిమారంగంలో ఆ పరిస్థితి లేదు. డివి నరసరాజుగారి మిత్రులు కొందరు యీ రంగంలోకి రాబోయి మానేశారట. ఏమంటే 'ఎక్కడైనా డబ్బిచ్చినవాడికి అందరూ దండాలు పెడతారు. ఇక్కడేమిటండీ బాబూ, డబ్బూ మనమే యిచ్చుకోవాలి, దండాలూ మనమే పెట్టుకోవాలి' అన్నారట.  

కథ చూసుకోవడం, సరైన వాళ్లను ఎంచుకుని బాధ్యతలు అప్పగించడం, ప్లానింగ్‌ చేసుకుని, దగ్గరుండి అన్నీ అమలయ్యేట్లు చూసుకోవడం - యివే నిర్మాత పనులు. ఈ రోజు నిర్మాత కథ చుట్టూ కాకుండా హీరోల కాల్షీట్ల కోసం వెతుకుతున్నారు. డైరక్టరు తనకు కథ చెప్పకపోయినా, బజెట్‌ ఎంతవుతుందో చెప్పకపోయినా డబ్బులు అప్పు తెచ్చి అతని చేతిలో పోస్తున్నాడు. ఎందుకు? అతను దాన్ని రెట్టింపు చేసి మళ్లీ తన చేతిలో పోస్తాడన్న దురాశతో! ప్రాక్టికల్‌ థింకింగ్‌ లేదు. ఏదో అద్భుతం జరిగిపోయి, మన సినిమాను హీరో, డైరక్టరు ఆడించేస్తారు అని ఆశ పెట్టుకుని తక్కినవాటిని పట్టించుకోవడం లేదు. రామానాయుడుగారు ఎప్పుడూ చెప్పేవారు - 'ఏట్లో పారేసినా ఎంచి పారేయాలి' అని. సెట్లో నిర్మాత వుంటే ఖర్చులో కనీసం 30% ఆదా అవుతుంది అని. సినిమాను  యిండస్ట్రీగా చూసినవారే బాగుపడతారు, పద్ధతీపాడూ లేకుండా, పబ్లిసిటీ కోసం విచ్చురూపాయలను విచ్చలవిడిగా విరజిమ్మేవారు ఖర్చయిపోతారు.  

రామానాయుడి గారి జీవితం మనకు స్ఫూర్తిదాయకం అంటూ పైకి చెప్పడం కాదు, ఏ వ్యాపారం చేసినా ఎంత శ్రద్ధగా చేయాలో ఆయనను చూసి కొంతైనా నేర్చుకోవాలి. డబ్బుంది కదాని ఆస్తులన్నీ అమ్మేసి సినిమా వ్యాపారంలోకి ఒక్కసారిగా దూకలేదు. డబ్బింగ్‌ సినిమా తీద్దామనుకుని, రామినీడుగారి సలహాతో చిన్న బజెట్‌ సినిమాలో భాగస్వామిగా దిగారు. రామినీడు వద్ద సినిమా రంగంలోని మెళకువలతో బాటు ప్రవర్తన విషయంలో జాగ్రత్తలు కూడా తెలుసుకున్నారు. మార్కెటింగ్‌లో వున్నవారికి ప్రెజెన్స్‌, పర్శనాలిటీ ఎలా అవసరమో, నిర్మాతకు కూడా మాటమంచితనం, ఎవరినైనా ఒప్పించగల నేర్పు వుండాలి. ''అనురాగం'' సినిమాలో తన కిచ్చిన పాత్ర చిన్నదని ఫీలైన షావుకారు జానకి వేషం వేయనన్నారు. దర్శకనిర్మాతలు చెప్పినా వినలేదు. అప్పుడు యీయన వెళ్లి 'ఇది నా ప్రథమ ప్రయత్నం, సహకరించండి' అని అడిగితే ఆవిడ 'మీకోసం చేస్తా' అంటూ ఒప్పుకున్నారు. 'కావాలంటే పారితోషికం ఎక్కువడగండి, యిస్తాం' అని పొగరుగా మాట్లాడి వుంటే పని అయివుండేది కాదు.  

నిర్మాతకు విజన్‌ వుండాలి. ''రాముడు-భీముడు'' లాటి కథను ఎందరో పెద్దలు తిరస్కరించారు. కానీ యీయన దానిలో బంగారుగనిని చూడగలిగాడు. దానిపై భారీగా పెట్టుబడి పెట్టాడు. అదే ఆయన్ను నిలబెట్టింది. ఆ సినిమా ఎన్ని భాషల్లో, ఎన్ని రకాలుగా వచ్చిందో అందరికీ తెలుసు. కథకు ఆయన ఎప్పుడూ ప్రాధాన్యత యిచ్చాడు. తమిళంలో నుంచి చాలా కథలు తీసుకున్నారు, రీమేక్‌లు చేశారు, తమిళ రచయితల కథలు తీసుకున్నారు, తెలుగు నవలలను సినిమాలుగా తీశారు, చివరిదాకా ఆయన కొత్త కథలు వింటూనే వున్నారు. కథలు నచ్చితే స్క్రిప్టు తయారుచేసి దాచి వుంచుకుని అవసరమైనపుడు బయటకు తీసిన సందర్భాలూ వున్నాయి. ఆయన అంచనాలు అన్ని వేళలా కరక్టు కాలేదు, కెరియర్‌లో చాలా ఫెయిల్యూర్లు వున్నాయి. ఏ వ్యాపారంలోనైనా అది సహజం. ఎక్కడా ఆగకుండా వరుసగా తీసుకుంటూ పోవడంతో టర్నోవర్‌ కారణంగా ఆయన సంస్థ నిలబడింది. వరుసగా ఫ్లాపులు వచ్చి దుకాణం కట్టేస్తారేమోననుకుంటే ఒక హిట్‌ వచ్చి నిలబెట్టేది. 1979-82 మధ్య ''ఒక చల్లని రాత్రి'', ''కక్ష'', ''అగ్నిపూలు'', ''ప్రేమమందిరం'' వచ్చి కోటి రూపాయల డెఫిసిట్‌లోకి వెళితే ''దేవత'' (1982) వచ్చి మళ్లీ వూపిరి పోసింది. (సశేషం) 
-  ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015) 
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 4

నవంబరు 20 న రాజపక్షతో కలిసి విందారగించిన మైత్రీపాల మర్నాడు పొద్దున్నకల్లా ''ఈ దేశపు ఆర్థికవ్యవస్థను, సాంఘికవ్యవస్థను ఒకే ఒక్క కుటుంబం శాసిస్తోంది. అందుకే బయటకు వచ్చేశా..'' అన్నాడు. ''వెన్నుపోటుదారులు యిలాగే వుంటారు'' అన్నాడు రాజపక్ష. విభీషణుడితో పోలిక తేలేదు, తను రావణుడు అనుకుంటారని, అంతిమంగా ఓడిపోతానని అనుకుంటారనీ! పోలీసు వ్యవస్థపై యింత పట్టు బిగించినా, తన వీపు వెనక్కాల యింత కుట్ర జరగడం అతను హరాయించుకోలేక పోయాడు. మైత్రీపాలతో బాటుగా ఐదుగురు ఎంపీలు కూడా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఒకరొకరుగా చాలామంది మంత్రులు కూడా.. ! అందర్నీ రాజపక్ష పార్టీలోంచి బహిష్కరించాడు. ప్రతిపక్షాలన్నీ కలిసి న్యూ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఎన్‌డిఎఫ్‌) ఏర్పరచారు. ఈ కూటమిలో రైటిస్టు భావాలున్న యుఎన్‌పి, మార్క్సిస్ట్‌ భావాలు కల జెవిపి, బౌద్ధ సన్యాసులు నడిపే జెఎచ్‌యు, రెండు ముస్లిము పార్టీలు, తమిళ నేషనల్‌ ఎలయన్స్‌ - లాటి భిన్న దృక్పథాలున్న పార్టీలున్నాయి.  

ఇంతమంది కలిసినా రాజపక్షపై విన్నింగ్‌ మార్జిన్‌ 3.7% మాత్రమే (81.5% పోలింగు జరగగా మైత్రీపాలకు 51.28%కు వచ్చి 12 ఎలక్టొరల్‌ జిల్లాలలో నెగ్గగా రాగా, రాజపక్షకు 47.58% వచ్చి 10 జిల్లాలలో నెగ్గాడు) అంటే రాజపక్ష ఎంత బలంగా పాతుకుపోయాడో చూడండి. 2010 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలలో అతని యుపిఎఫ్‌ఏకు 60.33% ఓట్లు, 225 సీట్లలో 160 సీట్లు వచ్చాయి. అతని కూటమిలో సిలోన్‌ వర్కర్స్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, లంక సమ సమాజ పార్టీ, నేషనల్‌ ఫ్రీడమ్‌ ఫ్రంట్‌, నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కర్స్‌, అప్‌ కంట్రీ పీపుల్స్‌ ఫ్రంట్‌ యిలా అనేకానేక పార్టీలున్నాయి. బోధుబలసేన మద్దతు ఎలాగూ వుంది. నవంబరు 18న జాతిక హేలా ఉరుమాయ అనే పార్టీ రాజపక్ష కూటమినుండి అతను పాలనా సంస్కరణలు చేపట్టటం లేదన్న అభియోగంతో బయటకు వచ్చేట్లా చేశారు. 2014 డిసెంబరు 8 నామినేషన్ల దినం కాగా అదే రోజున యిద్దరు ప్రతిపక్షాల ఎంపీలు రాజపక్షవైపు ఫిరాయించారు. వారిలో ఒకరిని రాజపక్ష మైత్రీసేన స్థానంలో ఆరోగ్యమంత్రిగా నియమించాడు. డిసెంబరు 23 న ప్రభుత్వపక్షం నుండి శ్రీలంక ముస్లిమ్‌ కాంగ్రెస్‌, ఆల్‌ సిలోన్‌ ముస్లిమ్‌ కాంగ్రెస్‌ అనే పార్టీలు బౌద్ధుల దాడుల నుంచి ముస్లిములకు రక్షణ కల్పించడం లేదన్న ఆరోపణతో ప్రతిపక్షంవైపు ఫిరాయించారు.  

ఇలాటి గందరగోళ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం ఎలా సాగిందో, ఏయే సేనలు ఎటు మోహరించాయో గమనించడం ఆసక్తికరంగా వుంటుంది. రాజపక్ష అంటే మైనారిటీలకు, తమిళులకు అసహ్యం కాబట్టి జనాభాలో వాళ్లు 25% కాబట్టి, వాళ్లకు నచ్చేట్లా వాగ్దానాలు గుప్పిస్తే ఓట్లు కురుస్తాయని మైత్రీసేన అనుకోలేదు. ఎందుకంటే తమిళ టైగర్లను అణిచేసిన చరిత్ర అతనికీ వుంది. అందువలన 2009 నాటి యుద్ధనేరాలపై అంతర్జాతీయ విచారణ జరిపించాలన్న కోరికకు తల వొగ్గలేదు. అలాగే ముస్లిము, క్రైస్తవులపై దాడుల గురించి విచారణ జరిపిస్తాననీ అనలేదు. మెజారిటీ బౌద్ధులను, సింహళీయులకు నచ్చేట్లా బౌద్ధమతానికి రాజ్యాంగరీత్యా ప్రముఖస్థానాన్ని కొనసాగిస్తానని హామీ యిచ్చాడు. ఆ విధంగా అతను రాజపక్ష ఓటుబ్యాంకులోకి చొరబడి అన్ని మతాలకు చెందిన సింహళ ఓట్లను కొల్లగొట్టాడు. మధ్య, దక్షిణ ప్రాంతాలలో ఆధిక్యత సంపాదించాడు. రాజపక్షకు గ్రామీణ ప్రాంతాలలో, సింహళ-బౌద్ధులున్న దక్షిణాగ్ర శ్రీలంకలో, ఆధిక్యత వచ్చింది. అక్కడ రాజపక్షకు 2% ఎక్కువ ఓట్లు రాగా, ఉత్తరాన, తూర్పున వున్న తమిళ, ముస్లిం ఓట్లు మైత్రీసేనకు తోడయ్యాయి కాబట్టి అతను రాజపక్ష కంటె కొద్దిపాటి మొగ్గు సంపాదించి నెగ్గేశాడు. హింసకు, వివక్షతకు, నిరుద్యోగానికి గురైన మైనారిటీలు, తమిళులు కసితో బూతుల వద్ద బారులు తీరి మైత్రీసేనకు విజయం కట్టబెట్టారు. 2010 ఎన్నికలలో రాజపక్ష ఎన్నిక కచ్చితం అని తెలుసు కాబట్టి అప్పుడు తమిళులు ఎన్నికల పట్ల ఆసక్తి చూపలేదు. ఎవరు కారణమో తెలియదు కానీ ఎన్నికల రోజున తమిళ ప్రాంతాలైన పాయింట్‌ పెడ్రో, వావూనియాలలో బాంబులు పేలాలి. తమను భయపెట్టి బూతులకు దూరంగా వుంచాలనే ప్రయత్నమే అనుకుని తమిళులు మరింత పట్టుదలతో ఓట్లేయడానికి వచ్చారు. మైత్రీసేన అక్కడకు ప్రచారానికి రాకపోయినా రికార్డు స్థాయిలో 68% పోలింగు జరిగింది.  

ఎన్నికలకు ముందుగా రాజపక్ష యిచ్చిన తాయిలాలను విమర్శించాలో లేదో ప్రతిపక్షం తేల్చుకోలేకపోయింది. వద్దంటే ఆ యా వర్గాలకు కోపం వస్తుందని భయం. ప్రభుత్వం 55 బిలియన్‌ డాలర్ల అప్పులో కూరుకుపోయిందని మాత్రం నిందిస్తూనే తాము అధికారంలోకి వస్తే అవన్నీ కొనసాగిస్తాయని హామీ యిస్తూ ఆ మాటకొస్తే పబ్లిక్‌ సెక్టార్‌లో జీతాలను 5000 పెంచుతాయని కూడా చెప్పింది. అవన్నీ యిప్పుడు ఎలా నెరవేరుస్తారో వేచి చూడాలి. వీళ్లు ఏం చెప్పినా ప్రభుత్వసాయంపై ఆధారపడిన సింహళ గ్రామీణ పేదలు రాజపక్షకే ఓటేశారు. సింహళీయుల్లో బౌద్ధులు, ధనికులు కూడా అతనికే ఓటేశారు. కొలంబోలోని నగరప్రాంతాలు, పారిశ్రామిక వాడల్లోని జనాభా 2010లో రాజపక్షకు ఓటేయగా, యీసారి అతనికి వ్యతిరేకంగా వేశారు. ఎందుకంటే అక్కడ వున్నవారిలో సింహళ, తమిళ భాషల క్రైస్తవులు, తమిళ హిందువులు, ముస్లిములు ఎక్కువగా వున్నారు. సమాజంలోని విద్యావంతులు, ఎకడమీషియన్లు, కార్మికనాయకులు, లెఫ్టిస్టులు, కళాకారులు, హక్కుల ఉద్యమకారులు అందరూ ఎక్కడున్నా సరే రాజపక్షకు వ్యతిరేకమయ్యారు.  

రాజపక్ష ప్రచారంలో భాగంగా 26 ఏళ్ల పాటు తమిళ టైగర్ల వలన దేశం అంతర్యుద్ధంలో ఎలా నాశనమైందో గుర్తుకు తెచ్చుకోండి అంటూ రేడియో, టీవీ స్లాట్‌ల ద్వారా మోగించేశారు. రాజపక్ష కారణంగానే శాంతి నెలకొంది, అతన్ని దింపేస్తే మళ్లీ అశాంతే అనే అర్థంలో తమిళ, సింహళ, ఇంగ్లీషు భాషలో పత్రికలలో యాడ్స్‌ గుప్పించారు. మైత్రీపాలను 'ఈలమిస్టు'గా 'ఎలిట్‌' (కులీనవర్గాల) ప్రతినిథిగా చూపిస్తూ తనను గ్రామీణ ప్రాంతాల ఛాంపియన్‌గా చిత్రీకరించుకున్నాడు. జాతిపరమైన మైనారిటీలు మొత్తం 22% మందే వున్నారు కాబట్టి, యీ రకమైన విభజన ద్వారా మెజారిటీ ప్రజల మద్దతుతో తను గెలవవచ్చని అతని లెక్క. కానీ అది తప్పింది. మైత్రీసేన నెగ్గాడు. ఇప్పుడు మైత్రీసేన ముందున్న సవాళ్లేమిటో చూద్దాం. (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 19-Feb-2015 22:00:00 GMT

Wednesday, February 18, 2015

ఎమ్బీయస్‌: శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన- 3

చంద్రికా కుమారతుంగ తండ్రి సోల్మన్‌ బండారనాయకేయే 1951లో శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పి) ని స్థాపించినది! స్వాతంత్య్రానంతరం ప్రధాన భూమిక వహించిన రెండు పార్టీలలో యిది ఒకటి. దీని సిద్ధాంతాలు సోషలిజానికి దగ్గరగా వుండగా దీని ప్రత్యర్థి యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి)  సెంటర్‌-రైటిస్టు పాలసీని అవలంబించేది. సోల్మన్‌ 1956లో దేశానికి ప్రధానిగా ఎన్నికై మూడేళ్ల తర్వాత హత్యకు గురయ్యాడు. అప్పుడు చంద్రిక తల్లి సిరిమావో పార్టీ పగ్గాలు చేతబట్టి 1960లో ప్రధానమంత్రి అయింది. వామపక్ష, ప్రజా సంక్షేమ విధానాలతో ప్రజలను ఆకట్టుకుంది. తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడి చెడ్డపేరూ తెచ్చుకుంది. 1977లో పదవీభ్రష్టురాలై జయవర్ధనే చేతిలో ఓడిపోయింది. చంద్రిక పారిస్‌లో చదువుకుంది. 1974లో శ్రీలంకకు తిరిగి వచ్చి పార్టీలో చేరి మహిళా విభాగంలో చురుగ్గా పనిచేసింది. ఒక సినిమా యాక్టరును పెళ్లాడి, తల్లి పార్టీని విడిచి అతని పార్టీలో చేరింది. అయితే అతను కూడా హత్యకు గురి కావడంతో ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడే చాలాకాలం వుంది. 1991లో తిరిగి వచ్చి పార్టీకి పునర్వైభవం కలిగేట్లా చేసింది.  

ఆమె తల్లి చాలా కుటిలత్వం ప్రదర్శించింది. కొడుకు అనూరకు, కూతురు చంద్రికకు మధ్య పోటీ పెట్టి పార్టీని తన అదుపులో వుంచుకోవాలని చూసింది. ముగ్గురిలో చంద్రిక తెలివితేటలు ప్రదర్శించి పీపుల్స్‌ ఎలయన్స్‌ పేర ఒక కూటమిని కూర్చి యుఎన్‌పి 16 ఏళ్ల పాలనను అంతం చేసి 1994లో అధ్యక్షురాలిగా ఎన్నికైంది. తల్లిని వూరికే వదిలేస్తే ప్రమాదమని 1994లో ప్రధానమంత్రిని చేసింది. ఆమె ఆరేళ్లు ఆ పదవిలోనే వుంది. చంద్రిక తమిళటైగర్లతో సంధియత్నాలు చేసింది, అవి విఫలం కావడంతో వారిపై మిలటరీని ప్రయోగించింది. టైగర్లు 1999 ఎన్నికల సమయంలో చేసిన ఒక దాడిలో ఆమె ఒక కన్ను పోయింది. ఆ ఎన్నికలలో సింపతీ ఓటుతో ఆమె యుఎన్‌పి తరఫు అభ్యర్థి రానిల్‌ విక్రమసింఘేను ఓడించి మళ్లీ అధ్యక్షురాలైంది. 2001 డిసెంబరులో ఆమె ప్రత్యర్థి రానిల్‌ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. అతను టైగర్లతో శాంతి చర్చలు మొదలుపెట్టాడు. ఆ మెతకవైఖరి చంద్రికకు నచ్చలేదు. అతను 2003 నవంబరులో అమెరికా వెళ్లినపుడు పార్లమెంటును ప్రొరోగ్‌ చేసి అతని అధికారాలు లాక్కుంది. వామపక్ష పార్టీ అయిన జనతా విముక్తి పెరమున, యింకా యితర పార్టీలతో కలిసి యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రీడమ్‌ ఎలయన్స్‌ (యుపిఎఫ్‌ఏ) అనే మరింత పెద్ద కూటమిని కూర్చి, దాని ద్వారా రాజపక్షను ప్రధానమంత్రిని చేసింది.  

అయితే 2005 కల్లా పెరమున విడిపోయింది. అప్పటితో చంద్రిక అధ్యక్షపదవి కూడా సమాప్తమైంది. ఆవిడ యింకా కొనసాగాలని చూసింది కానీ రాజపక్ష అడ్డుపడ్డాడు. కూటమిలోని 25 పార్టీలు - ఎస్‌ఎల్‌ఎఫ్‌పితో సహా - అతనికి అండగా నిలిచాయి. చంద్రిక సొంత పార్టీలోనే బలహీనపడింది. అధికారంలో వుండగా చంద్రిక తన తల్లి పద్ధతులకు వ్యతిరేకంగా గ్లోబలైజేషన్‌వైపే మొగ్గింది. ఉదార ఆర్థికవిధానాలు అవలంబించి ధనిక, పేద వ్యత్యాసానికి దోహదపడింది. అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. చంద్రిక స్థానంలో ఆమె సోదరుడు అనూరకు బదులుగా పార్టీ నేతలు రాజపక్షను అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టారు. అనూర కోపంతో యుఎన్‌పిలో చేరాడు. రాజపక్ష ఎన్నికల్లో నెగ్గి తమిళ టైగర్లను మట్టుపెట్టి తన బలాన్ని పెంచుకున్నాడు. తన నేతృత్వంలోని యుపిఎఫ్‌ఏ కూటమిలో 14 పార్టీలుండడంతో పోనుపోను చంద్రికను లక్ష్యపెట్టడం మానేశాడు.  పరాజయభారంతో కుములుతున్న చంద్రిక రాజపక్షపై కక్ష తీర్చుకోవాలనుకుంది. ఇన్నాళ్లకు అవకాశం రావడంతో ఎవరికీ తెలియకుండా వ్యూహరచన చేసింది. రాజపక్ష మంత్రివర్గంలో అసంతృప్తి రగులుతున్నట్లు కనిపెట్టిందామె. కొత్తగా పార్టీలో చేరి, రాజపక్షకు సన్నిహితులుగా మారి అవినీతికి పాల్పడుతున్నవారిపై చాలాకాలంగా వున్న అతని సహచరులకు అసూయగా వుంది. ఎదిరించి బయటకు వస్తే వేధింపులకు గురవుతామోనని భయపడుతున్నారు. రాజపక్ష సోదరులు యిప్పుడున్నదానితో సంతృప్తి పడకుండా యింకా పెద్దపెద్ద ప్లాన్లు వేస్తున్నారని వారికి తెలుసు, అతని కొడుకు వచ్చేసారి అధ్యక్ష అభ్యర్థి అని తెలుసు. ఇక వారి వంశం శ్రీలంకను ఎల్లకాలం పాలించడానికి సిద్ధపడుతోందని, ఇంకో 8 ఏళ్ల పాటు సాగబోయే పాలనలో తాము మరింతగా నామమాత్రు లవుతామనీ భయపడ్డారు. రాజపక్షకు అడ్డుకట్ట వేసి తీరాల్సిందే, కానీ ఎలా? తమకు బలం చాలదే అని మథన పడుతున్నట్లు చంద్రికకు తెలిసింది.  

రాజపక్ష వేలితో అతని కన్నునే పొడవాలనే ప్రణాళికతో అతని పార్టీలోనే అతనికి కుడిభుజంగా, అతని కాబినెట్‌లో ఆరోగ్యమంత్రిగా వున్న మైత్రీపాలను దువ్వింది. అతనికి మద్దతు పలకమని తనకు బద్ధశత్రువుగా వున్న యుఎన్‌పి నాయకుడు రానిల్‌ను కూడా అర్థించింది. ఈ కసరత్తు కొన్ని వారాలపాటు జరిగింది. ఆమె యింట్లోనే ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యేవారు. సమావేశాల గురించి సమాచారం అందించుకోవడానికి మామూలు ఫోన్లు వుపయోగిస్తే ప్రభుత్వ యింటెలిజెన్సు వర్గాలు పసిగడతాయనే భయంతో వారికి చిక్కకుండా వుండేందుకు ఎన్‌క్రిప్టెడ్‌ శాటిలైట్‌ ఫోన్లను ఉపయోగించారు. గత ఎన్నికలలో రాజపక్ష చేతిలో ఓడిపోయిన మాజీ ఆర్మీ చీఫ్‌ శరత్‌ ఫోనెస్కా వీరికి యిలాటి విషయాల్లో సాయపడ్డాడు. అనేక మంది డమ్మీ కాండిడేట్లను అభ్యర్థులుగా నిలిపి రాజపక్షను కన్‌ఫ్యూజ్‌ చేసి, అతనికి ఎన్నికలంటే నల్లేరుపై బండి నడక అనే అభిప్రాయం కల్పించారు.   

ప్రతిపక్షాల తరఫున ఎవరు సరైన అభ్యర్థి అని గాలిస్తే అనేక పేర్లు చర్చకు వచ్చాయి - చంద్రిక, యుఎన్‌పి సభ్యులు రానిల్‌ విక్రమసింఘే, కారూ జయసూర్య, నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ లీడరు జస్టిస్‌ మధులోలువె సొబితా, చీఫ్‌ జస్టిస్‌ శిరాణీ బండార్‌ నాయకే.. యిలా. చివరకు మైత్రీపాల సరైన అభ్యర్థి అని అందరూ అభిప్రాయపడ్డారు. మైత్రీపాల ఎస్‌ఎల్‌ఎఫ్‌పికి జనరల్‌ సెక్రటరీ, ఆరోగ్యమంత్రి. తమిళ టైగర్లతో పోరాడిన ఖ్యాతి రాజపక్షకు వున్నట్లే మైత్రీపాలకు కూడా వుంది. అతనిపై 2008లో టైగర్లు దాడి చేస్తే అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. యుద్ధం అంత్యథలో అంటే 2009లో అతను తాత్కాలికంగా డిఫెన్సు మినిస్టర్‌గా పనిచేశాడు. రాజపక్ష లాగా అతనూ సింహళ బౌద్ధుడు. గ్రామీణ ప్రాంతీయుడు. మధ్యతరగతి రైతు కుటుంబంలో 12 మంది పిల్లల్లో ఒకడిగా పెరిగాడు. స్థానికంగా చదువుకునే రోజుల్లో చైనాకు అనుకూలంగా వుండే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ సిలోన్‌లో సభ్యుడిగా వున్నాడు. కానీ తర్వాత ఎస్‌ఎల్‌ఎఫ్‌పి యూత్‌ వింగ్‌లో చేరాడు. 1971 నాటికి యూత్‌వింగ్‌ మాతృసంస్థపై తిరగబడినపుడు యితను కూడా తిరుగుబాటుదారుల్లో ఒకడు. 15 నెలలపాటు జైలు జీవితం అనుభవించాడు. 1989లో ప్రతిపక్ష సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టాడు. 1994లో అతని పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక, అతన్ని యిరిగేషన్‌ శాఖలో డిప్యూటీ మినిస్టర్‌గా వేశారు. తర్వాతి రోజుల్లో వ్యవసాయమంత్రిగా, ఆరోగ్యమంత్రిగా కూడా చేశాడు. రాజపక్షలో రాజరికపు పోకడలున్నాయి. వాణిజ్యవర్గాలతో స్నేహం వుంది. అత్యాశ వుంది. మైత్రీపాల పదవుల కోసం పాకులాడ లేదు. పైగా మృదుస్వభావి. మంత్రి అయినా గ్రామీణ పోకడలు విడిచిపెట్టలేదు. ఈ విధంగా రాజపక్ష లాటి నేపథ్యమే కలిగి వుండి, యుఎన్‌పి ఆమోదయోగ్యుడయ్యే అరుదైన వ్యక్తి యితనే అని తేల్చారు. (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 17-Feb-2015 22:00:00 GMT

Tuesday, February 17, 2015

ఎమ్బీయస్‌ : సౌదీ అరేబియాలో రాజు మారారు

సౌదీ అరేబియా పాలకుడు అబ్దుల్లా బిన్‌ అబ్దులజీజ్‌ జనవరి 23 న చనిపోయారు. అరబ్‌ ప్రాంతంలో అమెరికాకు చిరకాలమిత్రుడైన అబ్దుల్లా అంత్యక్రియలకు హాజరు కావడానికై ఒబామా తన భారతదేశ పర్యటనను కుదించుకోవలసి వచ్చింది. సౌదీ ఆచారం ప్రకారం అంత్యక్రియలు అతి నిరాడంబరంగా జరిగాయి. శవాన్ని ఒక గుడ్డలో చుట్టి కుటుంబసభ్యులు మోయగా, శవపేటిక కూడా లేకుండా గుర్తు పట్టలేని ఒక చోట కప్పిపెట్టారు. అక్కడ సమాధి కట్టడం లాటివి ఏవీ చేయరు.    లెక్కప్రకారం చూస్తే 2005 నుంచే అబ్దుల్లా రాజుగా వ్యవహరించారు. కానీ అంతకు పదేళ్ల ముందు నుంచే అతను తెర వెనుక నుండి అధికారం చలాయిస్తున్నాడు. అప్పటి రాజు ఫహద్‌ యితని సవతి సోదరుడే. ఇతను అప్పుడు యువరాజు. సౌదీ అరేబియా రాజ్యాన్ని స్థాపించిన ఇబ్న్‌ సౌద్‌ 1953లో చనిపోయాక, అతని కుమారులే ఒకరి తర్వాత మరొకరు రాజులవుతూ వస్తున్నారు. అబ్దుల్లా స్థానంలో యిప్పటిదాకా యువరాజుగా వున్న ఆయన సోదరుడు సల్మాన్‌ బిన్‌ అబ్దులజీజ్‌ సౌద్‌ కొత్తరాజు అయ్యారు. వయసు 70. వీళ్లందరూ సోదరులేనా అని ఆశ్చర్యపడవద్దు. వాళ్లు మొత్తం 53 మంది బ్రదర్స్‌! (ఇంతమంది పిల్లలకు పేర్లు వెతకడం కూడా కష్టమే కదా) ఈ సోదరులందరూ కలిసి వారసులెవరో నిర్ణయిస్తారన్నమాట. అందరి కంటె చిన్నవాడు 68 ఏళ్ల ముక్రీన్‌ను యువరాజు చేస్తూ కొత్తగా యువరాజుకి డిప్యూటీ (బాలరాజు అనాలేమో)ను కూడా నియమించాలని నిశ్చయించారు. అతను హోం మంత్రిగా పని చేస్తూ అల్‌ ఖైదాతో పోరాటం సాగిస్తున్న మహమ్మద్‌ బిన్‌ నయ్యీఫ్‌. ఇతను సౌద్‌కు కొడుకు కాదు, మనుమడు. ఈ మార్పుల వలన సౌదీ విధానాలు ఏమైనా మారతాయా అనేది ఆసక్తికరమైన అంశం. 

అబ్దుల్లాకు లిబియా అధినేత కల్నల్‌ గడ్డాఫీ అంటే అస్సలు పడేది కాదు. ఒకసారి అరబ్‌ లీగ్‌ సమావేశంలో అబ్దుల్లా గడ్డాఫీపై అరబిక్‌ భాషలో బూతులు కురిపించాడట. అమెరికా సాయంతో గడ్డాఫీని ఎలా అంతం చేశాడో చూశాం. ప్రస్తుతం సిరియా పాలకులపై కక్ష కట్టాడు. అంతకుముందు ఐయస్‌ (ఇస్లామిక్‌ స్టేట్‌)ను అణచాలని అమెరికా మిలటరీ కూటమి ఏర్పరచి సౌదీని భాగస్వామిగా చేసింది. అలాటి కూటమే మరొకటి ఏర్పరచి సిరియా పని పట్టాలని అబ్దుల్లా కోరుతూ వచ్చాడు. 2013లో  సిరియాపై దాడి చేయడానికి అమెరికా, సౌదీ, ఫ్రెంచ్‌ విమానాలు రెడీగా వున్న తరుణంలో ఆఖరి నిమిషంలో దాడి వద్దని అన్నందుకు ఒబామాను అబ్దుల్లా క్షమించలేదు. కొన్నాళ్లు పోయాక సిరియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, వారి సహకారంతో సిరియాలో వున్న ఐయస్‌ స్థావరాలపై దాడిచేశారు. కానీ అది అబ్దుల్లాను సంతృప్తి పరచలేదు.  

అబ్దుల్లాకు ఈజిప్టు అధ్యక్షుడుగా వున్న హోస్నీ ముబారక్‌ అంటే అభిమానం వుంది. ఈజిప్టులో విప్లవం చెలరేగి, అతన్ని కిందకు దింపేస్తూ వుంటే వేడుక చూస్తూ కూర్చుందని అమెరికాపై కినుక. హోస్నీ పతనం తర్వాత ముస్లిం బ్రదర్‌హుడ్‌కు బలం పెరిగి, ఆ ప్రాంతంలో బలం పుంజుకోవడం, అరబ్‌లో కల్లా పెద్ద దేశమైన ఈజిప్టులో ప్రజాస్వామ్యం కోసం డిమాండ్‌ రావడం - యివన్నీ చూశాక అబ్దుల్లాకు గుబులు ప్రారంభమై కినుక కోపంగా మారింది. అరబ్‌ ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఛాయలు పడకూడదన్న ఆదుర్దాతో ఈజిప్టులోని మిలటరీ ప్రభుత్వానికి ఆర్థికసాయం, నైతిక సాయం చేశాడు. అంతేకాదు, గల్ఫ్‌లోని యితర అరబ్‌ దేశాల నేతలను కూడా ఒప్పించి ఈజిప్టు ప్రజాస్వామ్యంవైపు వెళ్లకుండా మిలటరీకి మద్దతిచ్చేట్లా చేశాడు. అరబ్‌ ప్రజలెప్పుడూ రాజులకు సలాంలు చేస్తూనే వుండాలని అబ్దుల్లా కోరిక. వీళ్లు సున్నీలు. వీళ్ల రాజ్యంలో 15% వున్న షియాలు తమ పట్ల వివక్షత చూపుతున్నారని భావిస్తూ వుంటారు. బహరైన్‌లో రాజు కూడా సున్నీ, కానీ ప్రజల్లో షియాలకు సంఖ్యాబలం వుంది. వాళ్లు ఎన్నికలు కావాలంటూ, ప్రభుత్వంలో ప్రజలకు ప్రాతినిథ్యం వుండాలంటూ 2012, 2013లలో ఉద్యమాలు చేపడితే బహరైన్‌ రాజు అబ్దుల్లా సాయం అర్థించాడు. అబ్దుల్లా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కలిసి 'శాంతిసేన'ను పంపించి, ఉద్యమాన్ని అణచివేశారు. ఇప్పటికీ ఆ సేన అక్కడే వుంది.  

అబ్దుల్లాకు నచ్చని మరో దేశం షియాలు ఎక్కువగా వున్న ఇరాన్‌! బహరైన్‌, ఇరాన్‌. యెమెన్‌, లెబనాన్‌ - ఎక్కడ గొడవ జరిగినా ఇరానే వెనక నుంచి చేయిస్తోందని అతని అనుమానం. సిరియాలో ప్రభుత్వాన్ని మార్చేసి తన చెప్పుచేతల్లో వుండేవారిని నెలకొల్పాలనే అబ్దుల్లా కోరిక ఇరాన్‌, రష్యాలు సిరియాకు మద్దతు యివ్వడం చేత నెరవేరటం లేదు పాపం. తమ మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలని ఇరాన్‌ ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ అబ్దుల్లా స్పందించలేదు. ఇరాన్‌-అమెరికాల మధ్య అణు ఒప్పందానికి ఇజ్రాయేలు ఎంత వ్యతిరేకో, అబ్దుల్లా కూడా అంతే వ్యతిరేకి. సౌదీ రాజకుటుంబానికి రాజగురువులైన వహాబీ మతపెద్దల ప్రకారం షియాలు ఇస్లాం మతవిశ్వాసరహితులు. హసన్‌ వహాబ్‌ అనే మతగురువు 19 వ శతాబ్దపు చివరిలో వుండేవాడు. ఆయన కూతుళ్లలో ఒకరిని ఇబ్న్‌ సౌద్‌ పెళ్లాడి, ఆ మతపీఠంతో చేతులు కలిపాడు. సౌదీ రాజుల మద్దతుతో యీ గురువులు అరబ్‌ ప్రాంతమంతా పర్యటిస్తూ, తమ ప్రబోధాలతో ఇరాన్‌, ఇరాక్‌, సిరియా వంటి ప్రాంతాల్లో సున్నీ-షియా విభేదాలను రెచ్చగొడుతున్నారు. సిరియాను అల్లకల్లోలం చేయడానికి చూస్తున్న ఐయస్‌ సౌదీ తరహా పుస్తకాలను తమ అధీనంలో వున్న స్కూళ్లలో చదివిస్తోంది. ఇరాన్‌ బలపడితే సౌదీలో వున్న షియాలకు ధైర్యం వస్తుందని సౌదీ రాజుల భయం. 

ఆర్థికపరమైన అంశాలకు వస్తే - సౌదీ వైభవానికి కారణం ప్రపంచంలో కల్లా క్రూడ్‌ ఆయిల్‌ ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశమది. తన ఉత్పత్తిని పెంచో, తగ్గించో ప్రపంచంలో ఆయిల్‌ ధరలను నియంత్రించ శక్తి గలది. గత ఏడాదిగా ఆయిల్‌ ధరలు తగ్గుతున్నాయి. లెక్క ప్రకారం చూస్తే సౌదీ ఆయిల్‌ ఉత్పత్తి తగ్గించి డిమాండ్‌, ధర పడిపోకుండా, తాము నష్టపోకుండా చూసుకోవాలి. కానీ సౌదీ ఉత్పత్తి తగ్గించటమే లేదు, ఆయిల్‌ ధర యింకాయింకా పడిపోతున్నా సరే! దీని వెనక రాజకీయ కారణాలున్నాయి. సిరియాను వశపరచుకోవాలంటే దానికి మద్దతిస్తున్న ఇరాన్‌, రష్యాలను ఎలాగోలా దెబ్బ కొట్టాలి. ముందుగా రష్యాపై సామోపాయం ప్రయోగించి చూశాడు. 2014లో 'మీ వద్ద బిలియన్ల డాలర్ల ఆయుధాలు కొంటాం, సిరియాకు మద్దతు యివ్వడం మానేయండి' అన్నాడు. దానికీ, దీనికీ లింకు పెట్టవద్దు, దేనికదే అన్నారు రష్యావారు. రష్యా ఆర్థికవ్యవస్థను దెబ్బ కొట్టాలంటే ఆయిల్‌ ధర పెరక్కుండా చూడాలి అనుకున్నాడు. అదే రీతిలో ఆయిల్‌ ఉత్పత్తి చేసే మరో దేశమైన ఇరాన్‌ను కూడా దెబ్బ కొట్టాలంటే యిదే మంత్రం అనుకున్నాడు. పాత స్థాయిలోనే ఆయిల్‌ ఉత్పత్తి చేస్తూనే వున్నాడు. గత ఏడాది 100 డాలర్లు వున్న బారెల్‌, యిప్పుడు 50 డాలర్లకు పడిపోయింది. ఇరాన్‌, రష్యా విలవిల్లాడుతున్నాయి. అమెరికా ఆయిల్‌ ఇండస్ట్రీకి కూడా దీని వలన దెబ్బ తగిలింది. అయినా దానికి సంతోషమేమిటంటే ఆయిల్‌ ఎగుమతులపై ఆధారపడిన వెనిజులా వామపక్ష ప్రభుత్వం కూడా ఆర్థిక సంక్షోభంలో యిరుక్కుంది. ఆయిల్‌ ధరల తగ్గుదల వలన సౌదీ కూడా ప్రభావితమైంది. 2015 బజెట్‌లో 38.6 బిలియన్‌ డాలర్ల లోటు కనబడుతోంది. కానీ దానికి 750 బిలియన్‌ డాలర్ల రిజర్వ్‌స్‌ వున్నాయి కాబట్టి ధీమాగా వుంది. కొత్త రాజు యీ పాలసీని మార్చేస్తాడని అనుకోలేం కానీ, రాచకుటుంబంలోని పిన్నవయస్కులు ఎందుకొచ్చిన గోల యిది అనుకుంటున్నారట.  

2010లో అమెరికా ఆర్థికపరిస్థితి అతలాకుతలమైనపుడు అమెరికాతో ముడివేసుకున్న సౌదీ అరేబియాలో కూడా నిరుద్యోగం ప్రబలింది. అబ్దుల్లా 384 బిలియన్‌ డాలర్లతో పంచవర్ష అభివృద్ధి ప్రణాళిక ప్రవేశపెట్టాడు. అయినా జనాభాలో సగం మంది 25 ఏళ్ల వయసు కంటె తక్కువ వాళ్లే కాబట్టి యిప్పటికీ నిరుద్యోగ సమస్య తీరలేదు. నిరుద్యోగ భృతి కింద డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తోంది. రాజకీయ పరమైన సంస్కరణల విషయంలో అబ్దుల్లా కొద్దిపాటి మార్పులు చేశాడు. మహిళలు వాహనాలు నడపకూడదు కానీ మునిసిపల్‌ ఎన్నికలలో ఓటు వేయవచ్చు. ఆ బూతులపై నిఘా వుంటుందనుకోండి.  ఒక హద్దు వరకు మీడియా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. అలా అంటూనే హక్కుల ఉద్యమకారులను, రాజకీయ ఉద్యమకారులను జైళ్లలో పెట్టారు. ప్రభుత్వం పాటిస్తున్న మతఛాందసత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక వెబ్‌సైట్‌ పెట్టినందుకు రయీఫ్‌ బద్వాయీ అనే సౌదీ పౌరుడికి వెయ్యి కొరడా దెబ్బల శిక్ష విధించారు. మహిళలకు మరిన్ని హక్కులు కావాలని కోరిన ఒక షియా మతస్తుడికి గత అక్టోబరులో స్పెషల్‌ కోర్టు 'రాజధిక్కారం' నేరంపై మరణశిక్ష విధించింది. అంతర్జాతీయంగా నిరసన వెలువడడంతో మరణశిక్షను తాత్కాలికంగా నిలిపి వుంచారు. సౌదీ అరేబియాలో రాజు మారవచ్చు కానీ రాజరికపు పోకడలు ఎక్కడకు పోతాయి? ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షకులం, జీతం లేకుండా పోలీసు ఉద్యోగం చేస్తున్నాం అని చెప్పుకునే అమెరికా యిలాటివారికి వత్తాసు యిస్తూ వుంటుంది. దాని అండతో వీళ్లు ప్రజల హక్కులను కాలరాస్తూనే వుంటారు. 
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 16-Feb-2015 22:00:00 GMT

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 2

సామాన్యప్రజలు ఏమనుకున్నా పట్టించుకోనక్కరలేదని, ఎందుకంటే రాజకీయంగా తనతో తలపడగల మొనగాడే లేడని తలపోసిన రాజపక్ష యీ వూపులోనే మూడోసారి కూడా అధ్యక్షుడిగా ఎన్నికయిపోతే ఎప్పటికీ ఎదురు వుండదనుకుని, ముందస్తు ఎన్నికలు ప్రకటించాడు. 2013 జనవరిలో తనకు వ్యతిరేకంగా తీర్పు యిచ్చిన చీఫ్‌ జస్టిస్‌ శిరాణీ బండారునాయకేను రాజపక్ష పదవి నుంచి తొలగించాడు. దాంతో మధులోలువె సొబితా అనే బౌద్ధసన్యాసి నేతృత్వంలో ప్రజాహక్కుల ఉద్యమం మొదలైంది. ఆయన అందరి పట్ల నిష్పక్షపాతంగా వుంటాడన్న పేరు వుంది కాబట్టి ఏడాది తిరిగేసరికి సమాజంలోని అనేక వర్గాలు దానిలో చేరి ఆందోళన చేయసాగాయి. అది బలపడుతూండడం కూడా రాజపక్ష ముందస్తు ఎన్నికలు ప్రకటించడానికి ఒక కారణం అంటారు.  

1987 నాటి భారత-శ్రీలంక ఒప్పందం ప్రకారం ప్రాంతీయ కౌన్సిళ్లకు పోలీసు, భూమిపై అధికారాలు కట్టబెట్టాలి. రాజ్యాంగంలో ఆ విషయమై 13 వ సవరణ చేసినప్పటికి దాన్ని అమలు చేయడంలో విపరీతమైన జాప్యం జరిగింది. తమిళ ప్రాంతాలలో టైగర్ల ప్రాబల్యం వుండగా దాన్ని ఆలస్యం చేయడం సహజమేననుకుని భారత్‌ వేచి వుంది. 2009 తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని శ్రీలంక ప్రభుత్వమే చెపుతున్నపుడు మరి ఆ సవరణ చేయడానికి యింకేమిటి ఆలస్యం? అని ఇండియా ఫీలైంది. తమిళ ప్రాంతాల్లో ఎన్నికలు జరిపినా అక్కడి కౌన్సిళ్లకు అధికారాలు యివ్వకపోవడంతో అవి మునిసిపాలిటీల్లాగే వున్నాయి. యుద్ధం ముగిసిపోయినా అక్కణ్నుంచి మిలటరీని ఉపసంహరించలేదు. యుద్ధసమయంలో ఆక్రమించిన యిళ్లు, పొలాలు మిలటరీ అధీనంలోనే వుండిపోయాయి. పైగా మరి కొన్ని స్థలాలు తీసుకుని కొత్తగా మిలటరీ స్థావరాలు కట్టారు. యుద్ధనేరాలపై విచారణ జరిపిస్తానంటూనే జరిపించకపోవడంతో యునైటెడ్‌ నేషన్స్‌లో హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ 2012, 2013లో రాజపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేసినపుడు అమెరికాతో బాటు ఇండియా కూడా దాన్ని సమర్థించింది. అయితే చైనా వీటో చక్రం వేసి రాజపక్షను కాపాడింది.  

అప్పుడు యిండియాలో యుపిఏ ప్రభుత్వం వుంది. డిఎంకె ఒత్తిళ్లకు లొంగి, తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని, ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలపై పట్టుబట్టదని రాజపక్ష ఆశ పెట్టుకున్నాడు. అయితే రాజపక్షతో జరిగిన తన తొలి సమావేశంలోనే మోదీ 13 వ సవరణ అమలు గురించి ఏమైందని అడగడంతో దిగ్భ్రాంతి చెందాడు. దానికి ఫాలోఅప్‌ అన్నట్లు ఉత్తర ప్రాంతంలో కౌన్సిల్‌ను పాలిస్తున్న తమిళ నేషనల్‌ ఎలయన్స్‌ (టిఎన్‌ఏ) పార్టీ నాయకులు 2014 ఆగస్టులో రాజపక్షను కలిసి అమలు చేయమని కోరారు. రాజపక్షకు కోపం వచ్చింది. నెల తిరక్కుండా చైనీస్‌ సబ్‌మెరైన్లను కొలంబో హార్బర్‌లో డాక్‌ చేయడానికి తొలిసారి అనుమతించాడు. ఆ మరుసటి నెలలో అంటే అక్టోబరులో చైనా అధ్యక్షుడు ఇండియా, శ్రీలంక పర్యటనకు వచ్చినపుడు రెండోసారీ అనుమతించాడు. ఈ వరస చూసి రాజపక్షకు బుద్ధి గరపడానికి శ్రీలంక ఎన్నికలలో ఇండియా ప్రతిపక్షాలకు పరోక్షంగా సహాయం అందించిందని వినికిడి.  

రాజపక్ష  ప్రజలను వర్గాలుగా విడదీసి, కొందర్ని మచ్చిక చేసుకున్నాడు. తను లేకపోతే శ్రీలంక విచ్ఛిన్నమై పోయేదనే భావనను సింహళీయుల్లో కలిగించడానికి మీడియాను వాడాడు. తన గురించి గొప్పగా రాయడానికి, ప్రతిపక్షాలను చీల్చి చెండాడడానికి  ప్రభుత్వం చేతిలో వున్న మీడియాను వుపయోగించుకున్నాడు.   హోటళ్లు, బ్యాంకింగ్‌, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో తన స్నేహితులకు బాగా అవకాశాలు కల్పించి వారి ద్వారా మీడియాను లోబరుచుకోవడానికి, లొంగని చోట బెదిరించడానికి వుపయోగించుకున్నాడు. అనేక ప్రయివేటు మీడియా సంస్థలు ప్రభుత్వ లైసెన్సులకోసం, యాడ్‌లపై ఆదాయం కోసం అమ్ముడుపోయాయి. కొందరు పాత్రికేయులు స్వతంత్రంగా వ్యవహరించబోయారు. వారి ఫోన్లు ట్యాప్‌ చేయించాడు. ఇలాటి వేధింపులు తట్టుకోలేక కొందరు జర్నలిస్టులు విదేశాలకు పారిపోయారు.  

రాజపక్ష చేస్తున్న యీ పనులు పట్టణప్రాంతాల వారు, విద్యావంతులు ఏవగించుకున్నారు. అయినా సింహళ ప్రజలు తన పక్షానే వున్నారని రాజపక్ష గర్వం. ప్రతిపక్ష పార్టీ అయిన యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ (యుఎన్‌పి)కి అధ్యక్షుడైన రానిల్‌ విక్రమ్‌సింఘే సింహళ ఓట్లను తననుంచి గుంజుకోలేడని అతనికి తెలుసు. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలిపి తనను ఓడించే అవకాశం లేదని తెలిసి, యిదే అదనని ముందస్తు ఎన్నికలు ప్రకటించాడు. దానికి నెల ముందు ఓటర్లను ఆకట్టుకోవడానికి అక్టోబరులో ప్రకటించిన బజెట్‌లో సబ్సిడీలు పెంచుతానని, వాటర్‌ సప్లయి ప్రాజెక్టులు, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులలో ఎక్కువ పెట్టుబడులు పెడతానని, పన్నులు తగ్గిస్తానని, విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తానని హామీలు గుప్పించాడు. పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగుల జీతాలు పెంచాడు. ప్రయివేటు సెక్టార్‌ ఉద్యోగులకు యిచ్చే రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ మెరుగుపరిచాడు. పోలీసు అధికారులకు, ఉద్యోగులకు మోటారు సైకిళ్లు, స్కూటర్లు నామమాత్రపు ధరలకు అందించాడు. వరికి, పాల ఉత్పాదనలకు, రబ్బరుకు మద్దతు ధర పెంచాడు. హైస్కూలు విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, సీనియర్‌ సిటిజన్లకు, వికలాంగులకు, కిడ్నీ రోగులకు, మిలటరీ కుటుంబాలకు అలవెన్సులు పెంచాడు. నీరు, విద్యుత్‌ చార్జీలు, ఆదాయపు పన్ను రేట్లు తగ్గించాడు. ఇన్ని చిట్కాలు ప్రయోగించినా చివరకు ఓటమి తప్పలేదు. దానికి కారణం - గడ్డిపోచల్లా విడివిడిగా పడి వున్న ప్రతిపక్షాలు వెంటిగా ఏర్పడి రాజపక్ష అనే మత్తగజాన్ని బంధించడమే! వారిని అలా సంఘటితం చేసిన వ్యక్తి రాజపక్ష పార్టీకే చెందిన చంద్రికా కుమారతుంగ! (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 16-Feb-2015 22:00:00 GMT

ఎమ్బీయస్‌ : శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన - 1

శ్రీలంకకు కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మైత్రీపాల సిరిసేన ఫిబ్రవరి 16 న భారతదేశం రాబోతున్నారు. ఇది అతని మొదటి విదేశీ పర్యటన. రాజపక్ష చైనాకు అనుకూలంగా వ్యవహరించగా, సిరిసేన భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆశ పొడచూపుతోంది. అనూహ్యంగా 69 ఏళ్ల మహీంద్ర రాజపక్షను ఎన్నికలలో ఓడించిన సిరిసేన తను అనుకున్నది సాధించగలడా లేదాని వూహించేముందు శ్రీలంక ప్రస్తుత రాజకీయాలను ఒక్కసారి మననం చేసుకోవాలి.  

ఎల్‌టిటిఇని మట్టుపెట్టి, శ్రీలంకలో శాంతిని స్థాపించిన రాజపక్షకు యిప్పట్లో ఎదురు వుంటుందని ఎవరూ అనుకోలేదు. ముఖ్యంగా రాజపక్ష! అందుకే గడువుకు రెండేళ్ల ముందుగానే ఎన్నికలు జరుపుతామని నవంబరు 2014లో ప్రకటించి 2015 జనవరి 8 నాటి ఎన్నికలలో తన అధికారాన్ని తానే చేతులారా కూలదోసుకున్నాడు. గతంసారి దేశాధ్యక్షుడిగా వుంటూ 2009 మేలో తమిళ టైగర్లతో యుద్ధంలో గెలిచి, పౌరులందరూ అతన్ని పొగుడుతున్న తరుణంలో 2010లో అతను అధ్యక్ష ఎన్నికలు ప్రకటించాడు. ఎవరూ ఎదురుచూడని విధంగా అతని ఆర్మీ కమాండర్‌ జనరల్‌ శరత్‌ ఫోన్సేకా అతనితో తలపడ్డాడు. ప్రజలు రాజపక్ష పక్షాన నిలిచారు. శరత్‌ ఓడిపోయాడు. విజితుడి పట్ల రాజపక్ష ఔదార్యం చూపలేదు. నాకే ఎదురుతిరుగుతావా, బుద్ధి చెప్తానుండు అన్నట్లు చిన్న చిన్న ఆరోపణలపై అతన్ని జైలుపాలు చేశాడు, అతనితో పాటు అతని సహచరులను కూడా! ఇదే అది అతని పతనానికి నాంది అంటారు పరిశీలకులు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్ల కంటె ఎక్కువసార్లు అధ్యక్షుడిగా వుండకూడదు. తన అధికారాన్ని ఉపయోగించి 2010లో ఆ షరతు ఎత్తేశాడు. సుప్రీం కోర్టు ఆ సవరణను ఆమోదించేట్లు చూసుకున్నాడు.  

మంత్రివర్గాన్ని, పాలనా యంత్రాంగాన్ని, న్యాయవ్యవస్థను, మిలటరీని తన బంధువులతో, అనుచరులతో నింపేశాడు. తనవాళ్లనే ఉన్నత పదవుల్లో నియమించుకున్నాడు. వాళ్ల పేర్లన్నీ రాస్తే కొండవీటి చాంతాడంత జాబితా తయారవుతుంది. శాంపిల్‌గా - తమ్ముడు గోటబయ డిఫెన్సు సెక్రటరీ, ఇంకో తమ్ముడు చమాల్‌ పార్లమెంటులో స్పీకరు, మరో తమ్ముడు బాసిల్‌ గంఫా జిల్లా నుంచి ఎంపీ. చమాల్‌ పెద్ద కొడుకు శశీంద్ర ఊవా ప్రాంతానికి మాజీ సిఎం. రెండో కొడుకు శమీంద్ర శ్రీలంక పోర్ట్‌స్‌ అథారిటీకి డైరక్టర్‌. బావగారు నిశాంత విక్రమసింఘే శ్రీలంక ఎయిర్‌లైన్సుకి చైర్మన్‌, బావమరిది లలిత్‌ చంద్రదాస రాజపక్ష ఆఫీసులోనే న్యూట్రిషన్‌ ప్రాజెక్టుకి నేషనల్‌ కోఆర్డినేటర్‌, కజిన్‌ ప్రసన్న విక్రమసూర్య ఎయిర్‌పోర్టు ఏవియేషన్‌ సర్వీసెస్‌కు చైర్మన్‌. ఇక రాజపక్ష పెద్ద కొడుకు నామల్‌ యూత్‌ ఆర్గనైజేషన్‌కు చైర్మన్‌ ఎంపీ, రెండో కొడుకు యోసిత కార్లటన్‌ స్పోర్ట్‌స్‌ నెట్‌వర్క్‌కు ఓనరు. ఇతర దేశాల్లో శ్రీలంక రాయబారులుగా నియమితులైన వారిలో చాలామంది అతని బంధువులో, స్నేహితులో! ఇప్పుడు రాజపక్ష హడావుడిగా ఎన్నికలు పెట్టి గెలిచేయాలని చూడడం దేనికంటే - 28 ఏళ్ల తన కొడుకు నామల్‌కి 2021 నాటికి 35 ఏళ్ల వయసు వచ్చి, అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత తెచ్చుకుంటాడనిట! ఇలా తన వంశమే ఎల్లకాలం పాలించాలని అనుకున్నాడు. వాళ్ల కుటుంబం విలాసాల్లో మునిగి తేలింది. లగ్జరీ కార్లు, విమానాలు, గుఱ్ఱాలు కొనడానికి ప్రభుత్వధనం వ్యయం చేసింది. ఇతర కాబినెట్‌ మంత్రులు అలంకారానికి మాత్రం మిగిలారు. గొంతెత్తి వ్యతిరేకత తెలుపుదామంటే రాజపక్ష తన సొంత పార్టీలోని యితర ప్రముఖులపై కూడా నిఘా వేసి వుంచాడు. తనను విమర్శించినవారిని వెంటాడి వేటాడాడు.   

మైనారిటీలలో, తమిళ ప్రాంతాలలో అతని పట్ల విముఖత పెరిగినకొద్దీ గ్రామీణ ప్రాంతాలలో, సింహళీయులలో, బౌద్ధులలో అతని పట్ల ఆరాధన కొనసాగింది. బోధు బల సేన అనే అతివాద బౌద్ధ సన్యాసుల సంఘం 2012లో ముస్లిములు, క్రైస్తవుల పట్ల దాడులు జరిపింది. కొలంబో ప్రాంతంలో ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయి, బౌద్ధుల కంటె ఎక్కువ అయిపోతున్నారని దాని ఆందోళన. దానికి రాజపక్ష, అతని సోదరుడు గోటబయ మద్దతు వుంది. తమిళ టైగర్లను దునుమాడడంలో గోటబయ పాత్ర గణనీయమైనది. 2014 జూన్‌లో బలసేన ముస్లిం జనాభా అధికంగా వున్న బెరువల అనే పట్టణంపై దాడి చేసి అనేక ఆస్తులు ధ్వంసం చేసి నలుగుర్ని చంపేశారు. రాజపక్షకు మద్దతు యిస్తూ వస్తున్న ముస్లిం రాజకీయనాయకులు యీ దాడులకు నిరసన తెలిపి, నిందితులను అరెస్టు చేయాలని రాజపక్షను కోరారు. కానీ ఎవరూ అరెస్టు కాలేదు.  

ఆర్థికాభివృద్ధి 7% వుంది అని ప్రభుత్వం చెపుతున్నా శ్రీలంక ఆర్థికవేత్తలు అవన్నీ కిట్టించిన గణాంకాలు అంటున్నారు. రాజపక్ష పాలనలో ఉద్యోగాలు తగ్గాయి, జీతాలు తక్కువగా వున్నాయి. కానీ ప్రజలను ముగ్ధులను చేయడానికి పెద్ద పెద్ద మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులు తలపెడితే అందరూ వూరుకుంటారని అతను తలపోశాడు. చైనా అండగా నిలిచింది. అధిక వడ్డీలపై బిలియన్ల డాలర్ల ఋణాలు యిచ్చింది. ప్రాజెక్టుల వలన ధనం ప్రవహించి కొంతమంది లాభపడ్డారు. వాటి దీర్ఘకాల ప్రయోజనం మాట ఎలా వున్నా ప్రస్తుతానికి మాత్రం అవి గుదిబండల్లా తయారయ్యాయి. ఎందుకంటే వడ్డీలు కట్టడానికి ఏటా వచ్చే ఆదాయమే సరిపోనంత భారీగా అప్పులు తీసుకున్నాడు రాజపక్ష. ఇంత పెద్ద ప్రాజెక్టులు అవసరమా, దీర్ఘకాలంలోనైనా ఆదాయం వస్తుందా, ఆర్థికంగా నిలబడుతుందా (ఎకనమిక్‌ వయబిలిటీ) లేదా, వడ్డీలైనా తీర్చగలమా లేదా అన్న లెక్కలేవీ వేయకుండా వీటిలో దిగాడు. కాంట్రాక్టులు యిచ్చేటప్పుడు అంతర్జాతీయ టెండర్లు పిలిచే పద్ధతి లేదు. ఇతరులతో పోల్చి చూసే పద్ధతి లేదు. (మన ఆంధ్ర రాజధాని బృహన్నిర్మాణపు ప్రణాళికల గురించి, సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టులన్నీ కట్టబెడుతున్న తీరు వలన భవిష్యత్తులో జరగబోయే నష్టం గురించి యిక్కడ గుర్తు చేయడం అప్రస్తుతం కాదు) అన్నీ చైనాకు కట్టపెట్టాడు. ఈ ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకునే ముఖ్యమైన మంత్రిపదవులన్నీ రాజపక్ష బంధువుల వద్దే వున్నాయి. తన నియోజకవర్గపు ఓట్ల కోసం తన సొంత వూరిలో ఒక కొత్త ఎయిర్‌పోర్టు, కన్వెన్షన్‌ హాలు, ఎక్స్‌ప్రెస్‌ హైవే కట్టడానికి చైనానుండి ఋణం అర్థించాడతను. చైనా వాళ్ల దగ్గర కమిషన్‌ల కోసమే యీ ప్రాజెక్టులన్నీ అని, చివరకు ఆ అప్పులన్నీ తమ నెత్తిన పడతాయనీ శ్రీలంక ప్రజలు భావించారు. (సశేషం) 
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 16-Feb-2015 16:59:30 GMT

Sunday, February 15, 2015

ఎమ్బీయస్‌ : మాంసభక్షణపై ఆంక్షలు

గుజరాత్‌లో శాకాహారులు రాజకీయంగా బలంగా వున్నారు. గోవధ నిషేధించడంతో వారు ఆగటం లేదు. ప్రతి బక్రీద్‌కు గోవులను చాటుగా వధిస్తున్నారన్న మిషపై గొడవలు చేస్తున్నారు. ఇది మమ్మల్ని సతాయించడమే తప్ప మరేమీ కాదని ముస్లిములు వాపోతున్నారు. గత ఏడాది నవరాత్రి సమయంలో ఎవరో కావాలని మక్కా ఫోటోలపై దుర్గ ఫోటోలు సూపర్‌ యింపోజ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. దాతీపై గుజరాత్‌లో అహ్మదాబాద్‌తో సహా అనేక పట్టణాల్లో అల్లర్లు జరిగి కర్ఫ్యూ కూడా విధించవలసి వచ్చింది. ఈసారి దసరా, బక్రీద్‌ దగ్గరదగ్గర్లో వచ్చాయి కాబట్టి అలాటివి జరగకూడదనే ఆలోచనతో కొంతమంది పౌరులు హిందు, ముస్లిము ముఖ్యులతో శాంతి చర్చలు జరిపారు. ఏం చేసినా లాభం లేకపోయింది. బక్రీద్‌ సందర్భంగా గొఱ్ఱెలు, గేదెలు తీసుకున్న ట్రక్కులను ఆపి మీరు ఆవులను చాటుగా తీసుకెళుతున్నారు తనిఖీలు చేస్తాం అంటూ విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ సభ్యులు యిబ్బంది పెట్టసాగారు. చెక్‌ చేయడానికి మీరెవరంటూ ముస్లిములు వాళ్లతో తగాదా పడ్డారు. దాహోద్‌, పంచమహల్‌ జిల్లాల్లో యిది మరీ తీవ్రంగా సాగింది. బరోడా వంటి నగరాలలో రోజుల తరబడి హింసాత్మక ఘటనలు జరిగాయి.  

''గోవధ గుజరాత్‌లో చట్టవిరుద్ధం కాబట్టి ఎవరూ అలాటి నేరానికి పాల్పడి పండగపూట జైలుపాలవడానికి చూడడు. మోదీ ముఖ్యమంత్రిగా వుండగా గోధ్రా అల్లర్ల తర్వాత కూడా యిలాటి గొడవలు రాలేదు. ఇప్పుడు పెచ్చు మీరాయి.'' అంటున్నారు ముస్లిములు. 'మోదీ హయాంలో విఎచ్‌పి, బజరంగ్‌దళ్‌లను అదుపులో వుంచాడు. ఇప్పుడు వాళ్లు రెచ్చిపోతున్నారు.' అంటున్నారు పరిశీలకులు. గుజరాత్‌ వాతావరణాన్ని బిజెపికి పట్టున్న తక్కిన ప్రాంతాలకు కూడా వ్యాపింపచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఢిల్లీ శివార్లలోని బవానా ప్రాంతంలో వున్న లక్షన్నర జనాభాలో 70% మంది ముస్లిములు. అక్కడ ఆవులను తెచ్చి దాచారంటూ 200 మంది యువకులు అక్టోబరు 2 గాంధీ జయంతిన ముగ్గురు కానిస్టేబుల్స్‌ను వెంటపట్టుకుని చెకింగ్‌కు వచ్చారు. అక్కడ ఏ ఆవూ కనబడలేదు. మహేశ్‌ అనే అతను ఆవుతో కనబడితే అతన్ని చావగొట్టారు. నేను గొల్లవాణ్ని బాబోయ్‌, ఆవు నాదే అని గోలపెట్టాడతను. తమ ఆరోపణ నిజం చేయాలని ఆ యువకులు మర్నాటి రాత్రి రెండు ఆవులను కాలనీలో వదిలిపెట్టి రమ్మనమని ఒకణ్ని పంపించారు. ఇలాటిదేదో జరుగుతుందని ఊహించిన కాలనీవాసుల కమిటీ కాపు కాసి వాణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ విషయం తెలియక 'బవానాలో జరగబోయే సభకు రండి' అంటూ హిందూ క్రాంతికారీ సేన పేర మీద యిరుగుపొరుగు కాలనీలలో పోస్టర్లు వెలిశాయి. బిజెపి ఎమ్మెల్యే పవన్‌ శర్మ మేనల్లుడు ఆ సేన నిర్వాహకుల్లో ఒకడు. 

హిందువులకు గోవు పవిత్రమైనది కాబట్టి గోవధ నిషేధించాలని స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి ఆందోళన జరుగుతూనే వుంది. వట్టిపోయిన ఆవులను, ముసలివై పోయిన ఎద్దులను జీవితాంతం పోషించడం కష్టం కాబట్టి వాటిని కోసుకుని తినడానికి అనుమతించాలని, వేదకాలపు ఆర్యుల్లో కూడా గోమాంసభక్షణ వుందన్న విషయం గ్రహించాలని కొందరు వాదిస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా గోవధను నిషేధించడం రాజ్యాంగరీత్యా అనవసరమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. దాంతో 24 రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు ఆ పని తలపెట్టలేదు. ఈ నిషేధం కూడా అన్నిచోట్లా ఒకేలా లేదు. బెంగాల్‌లో 14 ఏళ్ల లోపు ఆవులను వధించకూడదు, తమిళనాడులో అది పదేళ్లు, అసాంలో అది నాలుగు! గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, యుపిలలో ఏ వయసు ఆవునూ చంపడానికి వీల్లేదు.  

స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లు లెక్కలోకి తీసుకుని చట్టాలు రూపొందిస్తున్నారు. మాంసభక్షణ కూడా భారతదేశమంతా ఒకేలా లేదు. మొత్తం మీద చూస్తే 31% మంది శాకాహారులు, 60% మంది మాంసాహారులు, 9% మంది గుడ్లు తినే శాకాహారులు. 2006 సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు మాంసాహారం (గుడ్లు, మాంసం, చేపలు)పై తలసరి ఖర్చు రూ.125, కేరళలో అయితే 215, గుజరాత్‌లో 24, పంజాబ్‌లో 13! ఆవులనే కాదు, గేదెలను కూడా చంపకుండా చట్టాలు జారీ చేయాలని ఆరెస్సెస్‌ ఉద్యమిస్తోంది. కానీ ఆవులు, గేదెలు ఒకే జాతికి చెందవని, కాబట్టే ఒకదానితో మరొకటి సంగమించవని సిసిఎంబి మాజీ డైరక్టర్‌ భార్గవ అంటారు. అసలు దేవుళ్ల ముందు గేదెలను బలి యిచ్చేది హిందువులే. హిందూరాజ్యమైన నేపాల్‌లోని కామాఖ్య దేవాలయంలో, కలకత్తాలోని కాళీ ఆలయంలో, మన తెలుగు ప్రాంతాల్లో కూడా దున్నపోతులను బలి యివ్వడం జరుగుతూనే వుంటుంది.  ఈ చర్చ సాగుతూండగానే రాజస్థాన్‌లోని బిజెపి ప్రభుత్వం ఒంటెను రక్షితప్రాణిగా డిక్లేర్‌ చేసింది. దాంతో ముస్లిములకు బక్రీద్‌ నాడు ఒంటెను బలిచ్చే అవకాశం లేకుండా పోయింది.  

విజయథమి రోజున దూరదర్శన్‌లో ప్రసంగిస్తూ ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ''అన్ని రకాల మాంసాల ఎగుమతి మనం నిషేధించాలి. గోమాంసం ఎగుమతి, గోవులను చాటుగా తరలించడం వెంటనే ఆపించాలి.'' అన్నారు. దానికి ఒక పదిహేను రోజుల ముందు అదే పార్టీకి చెందిన కేంద్రమంత్రి మేనకా గాంధీ మాంసానికి, టెర్రరిజానికి ముడిపెట్టబోయారు. ''జంతువులను చంపి, వాటి మాంసం ఎగుమతి చేసి సంపాదించిన డబ్బు టెర్రరిజానికి చేరి, అంతిమంగా మనుష్యులను చంపడానికి వుపయోగపడుతోంది'' అన్నారు. అటుతిప్పి, యిటుతిప్పి ముస్లిములకు ముడిపెడదామని చూస్తే మాత్రం పొసగదు. ఎందుకంటే భారీస్థాయి మాంసం ఎగుమతిదారులందరూ ముస్లిమేతరులే. 2012 అసెంబ్లీ ఎన్నికలలో మోదీ కాంగ్రెస్‌ సాధించినది పింక్‌ రివల్యూషన్‌ పేర మాంసం ఎగుమతులే అంటూ మతపరమైన కోణం యివ్వడానికి ప్రయత్నించారు. ఈ రోజు ఆయన ప్రధాని చైనాతో వ్యాపారలోటు పూడ్చుకోవాలంటే మాంసం ఎగుమతులను అనుమతించడమే కాదు, పెంచవలసిన అవసరం వుంది. 2013-14లో మనం 32 లక్షల కోట్ల రూ.ల మాంసం ఎగుమతులు చేశాం. భారతదేశానికి జంతుసంపద చాలా వుంది. మనం తినకుండా, అమ్మకుండా ఏం చేయాలని వీళ్ల ఉద్దేశమో తెలియదు. 'మనం జంతువులను తినకపోతే అవే మనల్ని (ఆర్థికంగా) తినేస్తాయి' అని ఒకాయన ఛలోక్తి విసిరాడు. పార్టీలోని జైన్‌ లాబీలను తృప్తి పరచడానికి మాంసాహారంపై అప్పుడప్పుడు యిలాటి హంగామా చేసినా, మాంసభక్షణ ఎక్కువగా వున్న బెంగాల్‌, కేరళ, ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాల్లో, బిసిలు, దళితులు వగైరా వర్గాల్లో విస్తరించడానికి చూస్తున్న తరుణంలో బిజెపి దీన్ని పెద్దగా పట్టించుకోదనే అనుకోవచ్చు.   
ఎమ్బీయస్‌ ప్రసాద్ 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 15-Nov-2014 22:00:00 GMT

ఎమ్బీయస్‌ :జయలలిత ఒడిదుడుకులు

జయలలితకు ప్రస్తుతం బెయిల్‌లో వున్నారు. ఇక్కణ్నుంచి జైలుకి వెళ్లాలో లేదో త్వరలోనే తేలుతుంది. ఏది ఏమైనా పదేళ్లపాటు ప్రభుత్వపదవులు చేపట్టే అవకాశం కనబడటం లేదు. పదవి లేకపోతే పార్టీపై ఆమె పట్టు నిలుస్తుందా? శివసేన బాల ఠాక్రే రిమోట్‌ కంట్రోలు చేతిలో పెట్టుకోవడంతో తృప్తిపడ్డారు. జయలలిత అలా తృప్తి పడగలదా? ఆమెలో మంచీ, చెడూ రెండూ వున్నాయి. మేధస్సు, వక్తృత్వం, పట్టుదల, కార్యదీక్ష, పరిపాలనా దక్షతతో బాటు, అవినీతి, ఆశ్రితపక్షపాతం, శత్రువులను సహించలేకపోవడం, అహంభావం, మొండివైఖరి కూడా వున్నాయి. ఏది ఏమైనా ఆమె ఒక బలీయమైన శక్తి. అయితే అది ప్రతికూల పరిస్థితుల్లో నుండి సేకరించిన శక్తి. అదీ విశేషం! ఆమె తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి సినిమాల్లో పాత్రలు వేసేది. హీరోయిన్‌ వేషాలు కాదు. సాధారణ వేషాలు. డబ్బుకి కాస్త కటకటే. అందుకే జయలలిత బాగా చదువుకుంటున్నా, యింకా చదువుకుంటానని మొత్తుకున్నా తల్లి బలవంతంగా ఆమెను సినిమాల్లో ప్రవేశపెట్టింది. తల్లి మాట కాదనలేక సినిమాల్లోకి వచ్చినా ఆమె ఆ రంగాన్ని ప్రేమించినట్లు ఎక్కడా కనబడదు. ఏ సినిమాను డైరక్టు చేయలేదు, తీయలేదు. దాన్ని ఒక వృత్తిగా, ధనార్జనకు సాధనంగా మాత్రమే చూసింది. కెమెరా ముందుకి పిలిచినపుడు వచ్చి నటించడం, విరామం వచ్చినపుడు ఒంటరిగా కూర్చుని చదువుకోవడం అదే ఆమెకు తెలుసు. 140 సినిమాల్లో వేసినా సహ నటీనటులతో స్నేహంగా వున్నదీ లేదు, వివాదాలు తెచ్చుకున్నదీ లేదు. దీనికి మినహాయింపులు లేకపోలేదు. తమిళ నటుడు చో రామస్వామి  ఆమెకు సన్నిహితుడుగా, హితైషిగా వుండేవాడు. శోభన్‌బాబుతో అయితే స్నేహానికి మించిన బంధం. ఎమ్జీయార్‌తో అయితే జీవితకాలపు అనుబంధం.  

16 వ యేట ఆమె సినిమాల్లోకి హీరోయిన్‌గా వచ్చిన తొలిరోజుల్లోనే ఎమ్జీయార్‌ కంటపడింది. అప్పటిదాకా బి.సరోజాదేవితో వరుసగా పదేళ్లపాటు సినిమాలు వేస్తూ వచ్చిన ఎమ్జీయార్‌ తన కంటె 31 ఏళ్ల చిన్నదైన యీమెతో ''ఆయురత్తిల్‌ ఒరువన్‌'' (1965) సినిమాతో జతకట్టాడు. ఆ సినిమా, ఆ జంట సూపర్‌హిట్‌ కావడంతో అప్పణ్నుంచి 1972 వరకు 28 సినిమాల్లో ఏకధాటీగా తన పక్కన హీరోయిన్‌గా వేషాలిప్పించాడు. జయలలిత ఒక్కసారిగా తారాపథానికి దూసుకుపోయింది. తెలుగులో ఏకంగా నాగేశ్వరరావు పక్కన  హీరోయిన్‌గా ''మనుషులు-మమతలు''లో నటించి యిక్కడా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ అగ్రతారలందరి సరసన నటించింది. ఎమ్జీయార్‌ ఆమెపై మక్కువ చూపాడు కానీ బహిరంగంగా పెళ్లి చేసుకోలేదు. అప్పటికే అతని మొదటి భార్య పోయింది. ఓ సినిమాలో తన పక్కన నాయకిగా వేసిన వివాహితురాలు జానకిని రెండో భార్యగా చేసుకున్నాడు. జయలలితను ప్రేయసిగానే చూశాడని తమిళప్రజలు నమ్మారు. కాదు, తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని జయలలిత అతని మరణం తర్వాత క్లెయిమ్‌ చేసింది. ఏది ఏమైనా ఎమ్జీయార్‌ జయలలితకే కట్టుబడి లేడు. ఆమె తర్వాత మంజులను తన సరసన హీరోయిన్‌ ఐదేళ్ల కాంట్రాక్టులో తీసుకున్నాడు. ఆమె తర్వాత లతను...! ''డాక్టర్‌ బాబు''(1973) టైములో శోభన్‌బాబుకు జయలలితతో స్నేహం పెరిగింది. కానీ ఎమ్జీయార్‌కు కోపం వస్తుందన్న భయంతో అతనూ దూరమై పోయాడు. ఎమ్జీయార్‌ తనను సొంత ఆస్తిగా చూస్తూ, ఎవరినీ దగ్గరకు రానీయకుండా చేస్తూ, అదే సమయంలో తను మాత్రం స్వేచ్ఛగా వర్తిస్తూ, తనను హింసిస్తున్నాడన్న కోపం ఆమెను దహించి వేస్తుండగానే తల్లి మరణించి మరింత ఒంటరి అయిపోయింది. 1980 నాటికి సినిమా కెరియర్‌ దాదాపు ముగిసిపోయింది. 

ఎమ్జీయార్‌ తొలిథలో కాంగ్రెస్‌వాది. తర్వాత ద్రవిడ కళగంలో చేరాడు. అణ్నాదురై ఆ సంస్థలో నుండి బయటకు వచ్చి డిఎంకె పెట్టినపుడు దానిలో సభ్యుడిగా వున్నాడు. ప్రచారకర్తగా వుండి, పార్టీ విజయానికి దోహదపడ్డాడు. 1967 ఎన్నికలలో డిఎంకె నెగ్గి అధికారంలోకి వచ్చింది. రెండేళ్ల తర్వాత అణ్నా చనిపోయినపుడు ముఖ్యమంత్రిగా ఎవరవుతారనే ప్రశ్న వచ్చినపుడు తన స్నేహితుడు కరుణానిధికి మద్దతుగా నిలబడ్డాడు. అయితే కరుణానిధి ఎమ్జీయార్‌ పాప్యులారిటీ చూసి అసూయపడి అతనికి చిక్కులు కలిగించాడు. ఎమ్జీయార్‌ విడిగా వచ్చి అన్నాడిఎంకె పార్టీ పెట్టాడు. ఉపయెన్నికలలో నెగ్గుతూ వచ్చి 1977 ఎన్నికలలో అధికారం సంపాదించి, పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్జీయార్‌ నిర్వ్యాపారంగా, బేలగా, ఒంటరిగా వున్న జయలలిత పట్ల కారుణ్యం చూపాడు. 1982లో జయలలితను రాజకీయాల్లోకి ఆహ్వానించాడు. మరుసటి ఏడాదే ప్రాపగాండా సెక్రటరీగా నియమించాడు. ఆమె సభల్లో పాల్గొని చక్కటి ఉపన్యాసాలతో ప్రజలను ఆకట్టుకోసాగింది. ఆమె అందం, సినిమా గ్లామర్‌, చక్కటి ఉచ్చారణ, అయిదారు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే చాకచక్యం యివన్నీ ఆమెకు ప్రత్యేక స్థానాన్ని సంతరించి పెట్టాయి.  

ఇది పార్టీలో సీనియర్లను మండించింది. ద్రవిడ పార్టీలన్నీ బ్రాహ్మణ వ్యతిరేకత అనే పునాదిపై ఏర్పడినవే. నాయకుల్లో ఎవ్వరూ బ్రాహ్మణులు లేరు. ఎమ్జీయార్‌ ఎడిఎంకె పెట్టాక వ్యతిరేకత కాస్త పలుచబడింది. తన వ్యక్తిగత వైద్యుడైన హండేను కన్నడ బ్రాహ్మణుడైనా ఫర్వాలేదని కాబినెట్‌లోకి తీసుకున్నాడు. ఇప్పుడు జయలలిత కూడా బ్రాహ్మణురాలే. పైగా ఆమె కన్నడిగురాలనే వాదం కూడా వుంది. ఇలా అయితే మన పార్టీ పరువేం కాను అని వాళ్లు గోలపెట్టినా లెక్కపెట్టకుండా ఎమ్జీయార్‌ జయలలితను 1984లో రాజ్యసభ ఎంపీగా చేశాడు. రాజ్యసభలో అద్భుతమైన మేధోప్రదర్శనతో,  విషయపరిజ్ఞానంతో, వక్తృత్వంతో ఆమె అందర్నీ ముగ్ధులను చేసింది. ఆమెకు పేరు వస్తున్న కొద్దీ అహంభావం మరింత పెరుగుతోందని, ఎమ్జీయార్‌ మరింతగా ఆదరించేట్లు వున్నాడని భయపడిన పార్టీ సీనియర్లు ఆమెకు వ్యతిరేకంగా ఎమ్జీయార్‌కు చాడీలు చెప్పసాగారు. 

ఇంతలో ఎమ్జీయార్‌ కిడ్నీ వ్యాధితో జబ్బుపడ్డాడు. చికిత్సకై అమెరికా వెళ్లవలసి వచ్చింది. 1984 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్జీయార్‌ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అమెరికాలో ఆసుపత్రిలో వుండగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన వీడియోలను అతనికి కుడిభుజంగా వున్న ఆర్‌ఎం వీరప్పన్‌ గ్రామగ్రామాన చూపించేవాడు. జయలలిత తను స్వయంగా వూరూరూ తిరిగి ప్రచారం చేసింది. ఎమ్జీయార్‌ పని ఆఖరై పోయిందని, ఎడిఎంకెకి వేసిన ఓటు వృథా అని ప్రచారం చేసిన డిఎంకె ఎన్నికలలో భంగపడింది. ఎమ్జీయార్‌ తిరిగి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. అయితే అతనికి మాట పోయింది. తర్వాత కొద్దిగా తిరిగి వచ్చినా స్పష్టత లేదు. శరీరం దుర్బలమై పోయింది. ఆ పరిస్థితుల్లో అతని భార్య జానకిది పైచేయి అయింది. వీరప్పన్‌ ఆమెకు అండగా నిలిచాడు. వీళ్లంతా కలిసి ఎమ్జీయార్‌ మనసులో జయలలిత పట్ల అపోహలు నాటారు. స్వతహాగా సందేహశీలి అయిన ఎమ్జీయార్‌ అవి నమ్మాడు. ఆమెను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడానికి ఒప్పుకున్నాడు. అయితే జయలలిత తనకు ఆత్మీయులైన అనుచరుల ద్వారా ఎమ్జీయార్‌కు లేఖ పంపి వాస్తవ పరిస్థితి వివరించింది. అపార్థాలు తొలగిపోయి ఎమ్జీయార్‌ ఆమెను పార్టీలో వుంచడమే కాకుండా పార్టీ సమావేశాల్లో ప్రసంగించేందుకు కూడా అనుమతించాడు.  

1987 డిసెంబరులో ఎమ్జీయార్‌ హఠాత్తుగా చనిపోయాడు. ఆ వార్త వింటూనే జయలలిత వెళ్లి ఎమ్జీయార్‌ శవం తల వద్ద నిలబడింది. టీవీలో అతని శవం కనబడుతున్నంతసేపూ తల వద్ద ఆమె కనబడడంతో ఆమెయే అసలైన వారసురాలు అనే అభిప్రాయం ప్రజల మెదళ్లలో పొజిషన్‌ అయిపోయింది. ఇది గ్రహించిన జానకి, వీరప్పన్‌ మనుష్యులు అంత్యక్రియల సమయంలో  శవం వున్న గన్‌ క్యారేజి నుంచి ఆమెను బలవంతంగా దింపేశారు. దాన్ని అవమానంగా చిత్రీకరించి ఆమె ప్రజల సానుభూతిని చూరగొంది. పార్టీ నిట్టనిలువుగా చీల్చింది. అప్పటిదాకా రాజకీయాలంటే ఓనమాలు తెలియని జానకిని ముఖ్యమంత్రిగా పెట్టి వీరప్పన్‌ చక్రం తిప్పాడు.  తర్వాత వచ్చిన ఎన్నికలలో ఎమ్జీయార్‌ వారసురాలు నేనంటే నేనని జానకి, జయలలిత పోటీపడ్డారు. వీళ్లిద్దరి మధ్య ఎడిఎంకె ఓట్లు చీలిపోవడంతో మధ్యలో డిఎంకె లాభపడి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు. జయలలిత ప్రతిపక్ష నాయకురాలైంది. జానకి రాజకీయాలకు స్వస్తి చెప్పి పార్టీని జయలలితకు అప్పగించేసింది. వీరప్పన్‌ ఎటూకాకుండా పోయాడు. 1989 మార్చి 25 న కరుణానిధి అసెంబ్లీలో బజెట్‌ ప్రసంగం చేస్తూండగా జయలలిత లేచి అడ్డుతగిలి ప్రశ్నలడగసాగింది. కరుణానిధి హేళనగా ''పోయి శోభన్‌బాబుని అడుగు'' అన్నాడు. చిర్రెత్తిన జయలలిత తన పార్టీ సభ్యులను 'కొట్టండిరా' అని ఆదేశించింది. కొందరు కరుణానిధిపైకి లంఘించారు. డిఎంకె సభ్యులు అడ్డుగా నిలిచారు. బాహాబాహీ యుద్ధం జరుగుతున్న సమయంలో పిడబ్ల్యుడి మంత్రి దురై మురుగన్‌ జయలలితపై పడి ఆమె చీర కొంగు లాగాడు. అంతే ఆమె ఉగ్రరూపం ధరించి బయటకు వచ్చి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ''దుశ్శాసనులున్న యీ సభలో మళ్లీ అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతాను'' అని శపథం చేసింది. రెండేళ్ల తర్వాత ఆమె శపథం నెరవేరింది. 

1991లో ఆమె ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్జీయార్‌ను పొగడడం తగ్గించింది. స్వీయప్రచారం చేసుకుంటూ, పాదాభివందనాలు చేయించుకుంటూ, అవినీతికి ఆశ్రితపక్షపాతానికి పాల్పడుతూ చాలా చెడ్డపేరు తెచ్చుకుంది. 1996 ఎన్నికలలో కాంగ్రెసుతో కలిసి పోటీ చేస్తే నాలుగు అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 39 పార్లమెంటు సీట్లలో ఒక్కటీ దక్కలేదు.  బర్గూర్‌ సీటులో స్వయంగా ఓడిపోయింది. కానీ తర్వాతి వచ్చిన కరుణానిధి ప్రభుత్వం యింతకంటె అధ్వాన్నంగా వుండడంతో 2001 ఎన్నికలలో ఆమె పార్టీ గెలిచింది. ముఖ్యమంత్రిగా వుండగానే కేసులు ఎదుర్కోవలసి వచ్చి పన్నీర్‌ శెల్వంను కూర్చోబెట్టింది. కేసుల్లో నెగ్గాక మళ్లీ ముఖ్యమంత్రి అయింది. తనను జైలుకి పంపిన కరుణానిధిని కూడా అర్ధరాత్రి అరెస్టు చేయించి జైల్లో పెట్టించింది. ఈసారి పాలనలో పరిపాలనా సామర్థ్యం పెంచుకుని, అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకున్నా ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఓడిపోయింది. ఐదేళ్ల తర్వాత 2011 లో మళ్లీ అధికారం చేపట్టింది. ఇలా అధికారం ఆమెతో నిరంతరం దోబూచులాడుతూనే వుంది. ఆమె గతంలో చేసిన పాపాలు యింకా వెంటాడుతూనే వున్నాయి. ఆమె మనసు, ఆలోచనాధోరణి ఎటువంటిదో ఎవరికీ అంతుపట్టదు. అయితే ప్రజల్లో మాత్రం ఆమె పట్ల అపారమైన సానుభూతి వుంది. కరుణానిధి అంటే యిష్టపడనివారికి మిగిలిన మార్గం జయలలితను సమర్థించడం ఒక్కటే. తక్కిన పార్టీలన్నీ సోదిలోకి లేకుండా పోయాయి. ప్రజాదరణ, పార్టీ నాయకుల బానిసత్వం ఎలా వున్నా న్యాయస్థానాల తీర్పుకు లోబడవలసినదే కదా. ఈ గతుకుల బాటపై జయలలిత గమనం సాగుతూనే వుంది. భయపడి చేతులెత్తేసే రకం కాదామె. పోరాడుతూనే వుంటుంది. దాని పర్యవసానం తెరపై చూడాల్సిందే.  
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 15-Nov-2014 22:00:00 GMT

ఎమ్బీయస్‌ : సిపిఎం ఆవిర్భావం - 09

రాజరికం పోయి ప్రజాస్వామ్యం రావాలని, భూస్వామ్య వ్యవస్థ పోవాలని, విదేశీ శక్తులని తరిమేయాలని సన్యట్‌ సేన్‌ ప్రారంభించిన కొమింటాంగ్‌ అనే దేశీయ ఉద్యమం దక్షిణ చైనానుండి ప్రారంభమై విజయవంతమయింది. ఈలోగా అంత:పుర కుట్రలు జరిగాయి. ప్రధానమంత్రి యువాన్‌కి, పూయీ చక్రవర్తికి విభేదాలు వచ్చాయి. అది అదనుగా 1912లో సన్యట్‌సెన్‌ చైనాను రిపబ్లిక్‌గా ప్రకటించి దానికి అధ్యకక్షుడయ్యాడు. ప్రధానమంత్రి యువాన్‌కి రాజ్యం అప్పగించి చక్రవర్తి పారిపోయాడు. ఇటువంటి సంధియుగంలో మన దేశంలో పాలెగార్లులా, అక్కడ తుచూన్లు అని పుట్టుకొచ్చారు. అంటే చిన్నచిన్న సంస్థానాధీశులు అన్నమాట. కాస్త సైన్యం, విదేశీయుల మద్దతు. ఒకళ్లతో ఒకళ్లు కొట్టుకోవడం. అందరూ కలిసి ప్రజలను దోచుకుతినడం. దోపిడీ దొంగలకు ఎక్కువ, సామంతరాజులకు తక్కువ! 

చైనా యిలా అంతర్గత కలహాలతో కొట్టుకు ఛస్తూ వుంటే జపాన్‌ మధ్యలో దూరింది. వాళ్లకు వెస్టర్నయిజేషన్‌ కారణంగా పారిశ్రామికీకరణ ఎక్కువ. కానీ చోటు తక్కువ. పక్కనున్న దేశాలను కబళించాలని ఎప్పుడూ ఆశే! అందునా చైనా యిలాటి పరిస్థితిలో వుంటే ఎంత హుషారుగా వుంటుంది! వాళ్ల చక్రవర్తిని కీలుబొమ్మ చేసి చైనాను అదుపులో తీసుకుందామని ప్రయత్నించింది. సాగలేదు. 1915 నుండి 1919దాకా జరిగిన మొదటి ప్రపంచయుద్ధ సమయంలో చైనాలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. యుద్ధం పూర్తయ్యాక బ్రిటన్‌ వగైరా దేశాలు జపాన్‌ ఆక్రమించిన ప్రాంతాలను జపాన్‌కి కట్టబెట్టి, చైనాకు అన్యాయం చేశాయి. దాంతో ప్రజలు భగ్గుమన్నారు. 1919లో ఓ విప్లవం చెలరేగింది. విదేశీ వస్తువులను దగ్ధం చేశారు. రష్యన్‌ విప్లవం చూసి ప్రభావితులైన యువకులు చైనా కమ్యూనిస్టు పార్టీ (సిసిపి) నెలకొల్పారు.  

విదేశీశక్తుల సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొవాలంటే కమ్యూనిస్టులు మొదట స్వదేశంలో వున్న జాతీయవాదులతో చేతులు కలపాలని, వాళ్లతో చేతులు కలిపి విదేశీయులను తరిమేశాక, అప్పుడు వీళ్ల పని పట్టాలని లెనిన్‌ సిద్ధాంతం. 'ఎందుకంటే ఈ జాతీయవాదులు ధనికుల కొమ్ము కాస్తారు. శాంతియుతంగా పోరాటం చేద్దామంటారు. మితవాద ధోరణి అవలంబిస్తారు. అందుచేత వారిని అణిచేసి, కార్మికరాజ్యం నెలకొల్పాలి. అలా అని, మొదటినుండే జాతీయవాదులతోనూ, విదేశీశక్తులతోనూ పోరాడబోతే యిద్దరూ కలిసి కార్మికులను అణిచేస్తారు.' అంటాడాయన. ఈ సిసిపీ అంటే చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ సన్యట్‌సెన్‌ గారి కుమిన్‌టాంగ్‌ పార్టీకి మద్దతు యిచ్చింది. రష్యా సన్యట్‌ సెన్‌ ప్రభుత్వాన్ని గుర్తించి, దానికి అన్నివిధాలా సహాయం చేయడంలో ఉద్దేశం యిదే. రష్యా మద్దతుతో, చైనీస్‌ కమ్యూనిస్టుల మద్దతుతో సన్యట్‌సెన్‌ ప్రభుత్వం దక్షిణ చైనాలో అనేక ప్రాంతాలకు విస్తరించింది.  

కానీ తుచూన్‌లు ఊరుకుంటారా? వాళ్ల కొమ్ముకాస్తున్న విదేశీశక్తులు ఊరుకుంటాయా? అంతర్యుద్ధం ప్రారంభించాయి. వాళ్లతో సంప్రదింపులు జరపడానికి వెళ్లి సన్యట్‌సెన్‌ మరణించాడు. ఇది 1925. ఆయన తర్వాత కొమింటాంగ్‌ నాయకుడిగా వచ్చిన చాంగ్‌-కై-షేక్‌  సన్యట్‌సెన్‌ వంటివాడు కాడు. మహా కుటిలుడు. కానీ సమర్థుడు. ఇతను కమ్యూనిస్టుల సహాయంతో తుచూన్లను అణచివేశాడు. మూడేళ్లలో దేశాన్ని ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకువచ్చాడు. ఇది జరిగాక విదేశీశక్తులతో చేతులు కలిపి కమ్యూనిస్టులను అణచివేయడం మొదలెట్టాడు. సన్యట్‌సెన్‌ ప్రవచించిన భూసంస్కరణల కార్యక్రమం పక్కన పడేశాడు. భూస్వామ్యవ్యవస్థను చెక్కు చెదరనీయలేదు. దీంతో కమ్యూనిస్టులు ఇతని ప్రభుత్వాన్నుండి 1929లో బయటకు వచ్చేశారు.  

1925 డిసెంబరులో భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఏర్పడినపుడు వున్న అంతర్జాతీయ వాతావరణం అది. చైనాలో కొమింటాంగ్‌లా భారత్‌లో కాంగ్రెసు జాతీయవాద పార్టీ. అప్పటికే బలంగా వుంది. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీలాగానే భారతీయ కమ్యూనిస్టు పార్టీ కూడా కాంగ్రెసుతో కొంతకాలం పని చేసి, తాము బలపడిన తర్వాత కలహించవచ్చు అని కమ్యూనిస్టు నాయకులు అనుకున్నారు. అది సాధ్యమా, ఎంత పిచ్చి ఆలోచన అని మనం యిప్పుడు అనుకోవచ్చు. చైనాలో మాత్రం మావో ఓ పట్టాన గెలిచాడా? మావోలాగే మనదేశంలోనూ విప్లవం తెచ్చేద్దామని కుతూహల పడిపోయేవారిలో చాలామంది మావో లాంగ్‌మార్చ్‌ అని బయలుదేర తీస్తే పోనుపోను చాలామంది వచ్చి చేరారని, ఆ ఊపులో అలాగే వెళ్లి సింహాసనం ఎక్కేశాడు అని అనుకుంటారు. లాంగ్‌మార్చ్‌వల్ల మావో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే కానీ వెంటనే అధికారం సిద్ధించలేదు. లాంగ్‌మార్చ్‌ జరిగినది 1934-35 మధ్య. మావో ప్రభుత్వం ఏర్పరచినది 14 ఏళ్ల తర్వాత 1949లో! లాంగ్‌ మార్చ్‌కు ముందు ప్రభుత్వం నుండి బయటకు వచ్చాక జియాంగ్సీ పర్వతాలకు వెళ్లి అక్కడ సోవియట్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పేరుతో రాజ్యం ఏర్పరచుకుని  1931 నుండి 1934 వరకు పాలించాడు. తాను అనుకున్న సంస్కరణలు అమలు చేయసాగాడు. చాంగ్‌ కై షేక్‌ చేతిలో ఓడిపోయిన కమ్యూనిస్టులకు ఆశ్రయం కల్పించేవాడు.  

అదే పద్ధతిలో తెలంగాణలో కూడా కమ్యూనిస్టు రాజ్యం తెచ్చేసి, అక్కణ్నుంచి దేశమంతా వ్యాపించేద్దామని భారత కమ్యూనిస్టులు అనుకున్నారు. అంతేగానీ, ఒక పాఠకుడు రాసినట్లు దాన్ని రష్యాలో కలిపేద్దామని కాదు. ఎక్కడి తెలంగాణ? ఎక్కడి రష్యా? సరిహద్దులు కలుస్తాయా? అసలు తెలంగాణ పోరాటం తప్పని స్టాలిన్‌ తిట్టిపోశాడట. యుద్ధంలో ఓడిపోతే పారిపోవడానికి సముద్రతీరం లేకుండా అన్ని వైపులా భూమి వుంది కదా, ఎలా గెలుస్తారనుకున్నారు? అని మందలించి, పోరాటం విరమించమని సలహా యిచ్చాడట. ప్రపంచ చరిత్రలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏదైనా వుంది అంటే అది మన దేశంలోని కేరళ రాష్ట్రంలోనే. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ 1957 ఎన్నికలలో గెలిచారు. తక్కిన కమ్యూనిస్టు విజయాలన్నీ హింసాత్మకమైనవే. అహింస ద్వారా స్వాతంత్య్రం తెచ్చుకున్న భారతదేశంలో హింసాధోరణికి గిరాకీ లేదని అప్పటి గదర్‌ పార్టీ నుంచి, యిప్పటి మావోయిస్టుల దాకా గుర్తించకపోవడం దురదృష్టకరం. లేటుగా నైనా అది గుర్తించిన సిపిఐ, సిపిఎంలకు రివిజనిస్టు పార్టీలుగా వీరి చేత ముద్రపడడం విషాదకరం. (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 26-Nov-2014 22:00:00 GMT

ఎమ్బీయస్‌ :సిపిఎం ఆవిర్భావం - 08

1920 ప్రాంతానికి కమ్యూనిజం వ్యాప్తికై రష్యా ప్రయత్నించే రోజుల్లో దాని దృష్టి సహజంగా భారతదేశంపై పడింది.  చైనాలో అప్పటికే కమ్యూనిజం ప్రభవిస్తోంది. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యపు కిరీటంలో కలికి తురాయిగా వున్న భారతదేశం వామపంథావైపు మొగ్గితే అంతకంటె యింకేం కావాలి? భారతదేశంలో అప్పటి పరిస్థితి ఏమిటి? కొన్ని చోట్ల బ్రిటిషు పాలన, మరి కొన్ని చోట్ల బ్రిటిషు సూపర్‌విజన్‌లో సంస్థానాధీశుల పాలన నడుస్తోంది. సంస్థానాధీశుల్లో చాలా కొద్దిమంది తప్ప తక్కినవాళ్లందరూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. జమీందార్ల పీడన సాగుతోంది. ప్రజలలో, వ్యవసాయదారుల్లో అసంతృప్తి వుంది. కొన్ని చోట్ల పరిశ్రమలు వచ్చాయి. పారిశ్రామికవేత్తలు కార్మికులను వేధిస్తున్నారు. ఈ అన్యాయాలను గమనించిన కొందరు విద్యావంతులు శ్రామికుల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన సంఘాలుగా ఏర్పడి ఎదిరిస్తున్నారు. వీరిలో అందరూ వామపక్షవాదులు కాదు. అప్పట్లో ప్రజాచైతన్యానికి ప్రతిరూపంగా కాంగ్రెసు పార్టీ వుంది కాబట్టి కాంగ్రెసు పార్టీకి అనుబంధంగా అనేక సంఘాలు పనిచేసేవి.  

కాంగ్రెసు పార్టీ అంటే మొదటినుంచీ కలగూరగంప. పూర్తి రైటిస్టుల నుండి, పూర్తి లెఫ్టిస్టుల వరకు అందరూ దానిలో వుండేవారు. అసలు అప్పట్లో అందుబాటులో వున్న వేదిక అదొక్కటే. జనసామాన్యానికి తెలిసిన పేరు అదే. ''రామరాజ్యానికి రహదారి'' నవలలో పాలగుమ్మి పద్మరాజుగారు ఒక సంఘటన రాస్తారు - గాంధీని విమర్శించే కమ్యూనిస్టు ఒకతను రైల్వే స్టేషన్‌లో అరెస్టవుతాడు. ప్రజలు అతన్ని చుట్టుముట్టి పోలీసులను ప్రతిఘటిస్తారు. వారందరూ యిచ్చే నినాదం - 'మహాత్మా గాంధీకి జై'! అందుకే ఏపాటి రాజకీయ చైతన్యం వున్న వ్యక్తయినా కాంగ్రెసులోనే చేరేవారు. తర్వాతి రోజుల్లో పూర్తి పెట్టుబడిదారీ విధానాలతో, సంస్థానాధీశుల పక్షాన వాదించిన స్వతంత్ర పార్టీ స్థాపించిన రాజాజీ చేరినది, ఎదిగినదీ కాంగ్రెసులోనే. కాంగ్రెసు విధానాలతో పూర్తిగా విభేదించే బిజెపికి పూర్వరూపమైన జనసంఘ్‌ స్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ కాంగ్రెసులోనే వుండేవారు. కాంగ్రెసు బద్ధశత్రువులుగా పేరు బడిన సోషలిస్టు పార్టీ నాయకుడు జయప్రకాశ్‌, ద్రవిడ కజగం రామస్వామి నాయకర్‌, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు నంబూద్రిపాద్‌ - ఒకరా యిద్దరా, అందరూ తొలిథలో కాంగ్రెసులోనే చేరారు. చేరాక తమలాటి భావాలున్న వాళ్లతో కలిసి గ్రూపులు కట్టారు. కాంగ్రెసు స్టీరింగును తమ చేతిలోకి తీసుకుందామని ప్రతి గ్రూపూ ప్రయత్నించింది. ఒక్కోసారి ఒక్కో గ్రూపుది పై చేయి అయేది.  

అందుకే కాంగ్రెసు పార్టీ విధానాలలో వైవిధ్యం, పరస్పర వైరుధ్యం కనబడతాయి. పార్టీ ఒక్కటే, కుటుంబమూ ఒక్కటే. కానీ నెహ్రూ విధానం వేరు, ఇందిర విధానం వేరు, రాజీవ్‌ విధానం వేరు. ఇందిర కూడా పరిపాలనలో తొలిసగంలో అవలంబించిన విధానాలు వేరు, మలిసగంలో పద్ధతి వేరు. అందువలన ఆయా విధానాలు నచ్చినవారు ఆయా సమయాల్లో కాంగ్రెసుకు సమర్థకులుగా వుండేవారు, విధానం మారితే వీరు బయటకు వెళ్లిపోయేవారు. స్వాతంత్య్ర పోరాటకాలంలో కూడా బ్రిటిషు వారి పట్ల కాంగ్రెసు విధానం మారుతూ వచ్చింది. గోఖలేది మితవాదం, టిళక్‌ (తిలక్‌) అతివాదం. గోఖలేకి శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గాంధీ తనకంటూ వేరే బాట వేసుకున్నాడు. నెహ్రూ గాంధీకి అనుచరుడిగా వుంటూనే అనేక విషయాల్లో బహిరంగంగా విభేదించేవాడు. వారిద్దరిదీ తండ్రీ-కొడుకుల బంధం వంటిది. విరుద్ధభావాలు, అయినా ఒకరి పట్ల మరొకరికి అపారమైన గౌరవం. బోసు, పటేల్‌, ప్రకాశం - అందరూ కొన్ని విషయాల్లో గాంధీని వ్యతిరేకించినవారే, కొన్ని విషయాల్లో అనుసరించినవారే. ఒకలా పోలిక చెప్పాలంటే కాంగ్రెసు పార్టీ హిందూమతం లాటిది. హిందూమతానికి నిర్దిష్టమైన విధానం అంటూ లేదు. శివుడు తప్ప అన్యులు దేవుళ్లు కారు అనేవారూ హిందువులే, విష్ణువు తప్ప యితరులు పూజ్యులు కారు అనేవారూ హిందువులే. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వంటి పరస్పర విరుద్ధమైన ప్రతిపాదనలన్నీ హిందూమతంలో భాగాలే. అంతెందుకు చార్వాకం వంటి నిరీశ్వరవాదాలు కూడా హిందూమతంలో అంతర్భాగాలే. ఇలాటి గందరగోళపు, నిర్దిష్టవ్యక్తిత్వం లేని, నిరంతర మార్పుకు గురయ్యే కాంగ్రెసును ఎలా నిర్వచించాలో, దానితో ఎలా వ్యవహరించాలో తెలియకనే కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో దెబ్బ తింది.  

అసలు కాంగ్రెసు పార్టీ స్వభావంతో కమ్యూనిస్టులకు ఏమి పని? తమ పార్టీ సంగతేదో తాము చూసుకోవచ్చు కదా అనుకోవచ్చు. దీనికి సమాధానం పైనే చెప్పాను. ఏకలక్ష్యంతో పనిచేసే ప్రజాదరణ కలిగిన జాతీయపార్టీలతో కొంతకాలం భుజం కలిపి, అదను చూసి దాన్ని దెబ్బ తీసి తాము అగ్రస్థానానికి రావాలని కమ్యూనిస్టు సిద్ధాంతకర్తలు చెపుతూ వుంటారు. చైనాలో అది జరిగింది. చైనా ప్రయోగాన్ని యిక్కడ కూడా అమలు చేద్దామని రష్యా అనుకుంది కాబట్టి ఇక్కడ చైనా కథ కాస్త చెప్పుకోవాలి. చైనాలో రాజరికం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. చివరి ఒక రాణిగారు తెర వెనక్కాల వుండి చక్రం తిప్పుతూ పారాడే ఓ పసిబాలుణ్ని 1900 సం||రంలో చక్రవర్తి చేసింది. తనకు 93 యేట మృత్యువు వచ్చేదాకా పాలించింది. అప్పటికే పారిశ్రామికీకరణ జరిగి యూరోప్‌ దేశాలన్నిటిలో ప్రజలు బలపడి, రాజులు బలహీనపడ్డారు. ఆ విధానాలు యిక్కడకు పాకితే తన ప్రజలకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి కొత్త ఐడియాలు వస్తాయన్న భయంతో ఆధునిక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి జంకింది. దానివల్ల చైనా బలహీనపడి స్థానిక పాలకులు పీడకులయ్యారు. మరోపక్క యూరోపియన్‌ దేశాలు ఆర్థిక దోపిడీ చేశాయి. ప్రభుత్వోద్యోగుల్లో అవినీతి, అసమర్థత పెరిగాయి. ప్రభుత్వానికీ ప్రజలకూ దూరం పెరిగింది. కరువులు, వరదలు, దాంతో కొంతమంది బందిపోట్లుగా మారడం! ఈ చక్రవర్తులు పోతేగానీ దేశం బాగుపడదని అందరూ అనుకున్నారు.     
ముసలి మహారాణిగారు పోయిన తర్వాత ఈ చిన్నకుర్రాడిని సింహాసనంపై కూర్చోపెట్టి మంత్రులు యిష్టం వచ్చినట్టు పాలించారు. వాళ్ల పాలన యింకా అధ్వాన్నం. విదేశీ శక్తులు - అంటే బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా, జపాన్‌, పోర్చుగల్‌, జర్మనీ - దీన్ని అలుసుగా తీసుకుని చైనాను ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ మధ్య పంచేసుకున్నాయి. అతి ప్రాచీనకాలం నుండి స్వాతంత్య్రం అనుభవించిన చైనా గతి యిలా అవడం చదువుకున్న చైనీయులను బాధించింది. వారిలో సన్యట్‌సెన్‌ అనే ఓ డాక్టర్‌ విప్లవం లేవదీశాడు.  (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 27-Nov-2014 18:25:48 GMT

ఎమ్బీయస్‌ : సిపిఎం ఆవిర్భావం - 07

స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నవారందరిదీ ఒక పంథా కాదు. కొందరు హింసామార్గం పట్టారు. వారిని చూపించి బ్రిటిషు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తెచ్చి శాంతియుతంగా చేసేవారిని సైతం జైళ్లల్లో కుక్కింది. 'హింసామార్గంలో వెళ్లినవారి వల్లనే యీ గతి పట్టింది, వారు పరోక్షంగా బ్రిటిషువారికి సాయపడ్డారు' అనవచ్చా? ప్రపంచయుద్ధాలు వచ్చినపుడు 'యుద్ధసమయంలో మీరు మాతో సహకరించండి, ఆందోళనలు ఆపండి, యుద్ధానంతరం స్వాతంత్య్రం యిస్తాం' అని బ్రిటిషు వాళ్లు అన్నారు. 'వాళ్లు పెద్దమనుషులు, యిచ్చిన మాట నిలబెట్టుకుంటారు, సహకరిద్దాం' అన్నవాళ్లు దేశభక్తులా? దేశద్రోహులా? 'ఈసారికి యిలా కానిద్దాం, అంతగా కాకపోతే వచ్చేసారి చూసుకుందాం' అనుకోవడానికి ప్రపంచయుద్ధాలు మాటిమాటికీ జరుగుతాయని, నిశ్చిత విరామంలో జరుగుతాయనీ గ్యారంటీ వుందా?  

పోరాట సమయంలో ఎన్నో రకాల ఎత్తుగడలు వుంటాయి. కొన్ని ఫలిస్తాయి, కొన్ని దెబ్బ తింటాయి. అంతమాత్రం చేత దురుద్దేశాలు అంటగట్టకూడదు. రెండవ ప్రపంచయుద్ధంలో నేతాజీ సుభాష్‌ బోసు విదేశీయులతో చేతులు కలిపి భారతదేశంపై దాడి చేశాడు. మరి ఆయన దేశభక్తుడు కాడా? 'శత్రువు మిత్రుడు శత్రువు' అనే సిద్ధాంతాన్ని నమ్మాడాయన. నిజంగా ఆ యుద్ధంలో జపాన్‌ వాళ్లు నెగ్గి వుంటే ఇండియాకు స్వాతంత్య్రం యిచ్చేవారా? మనల్ని వలసరాజ్యం చేసుకుని చైనాపై దండెత్తి దాన్నీ తమ వశం చేసుకునేవారు కారా? బ్రిటన్‌లో ఎంతోకొంత ప్రజాస్వామ్యం అఘోరించింది. ప్రజాదరణ కలిగిన, యుద్ధానంతరం అధికారంలోకి వచ్చిన లేబర్‌ పార్టీ భారత్‌కు స్వాతంత్య్రం యివ్వాలని తీర్మానించింది. జపాన్‌లో యుద్ధోన్మాదం ఎక్కువ. చక్రవర్తికి అధికారాలు ఎక్కువ. పొరుగు రాజ్యమైన చైనాపే ఎప్పుడూ కన్నే. వలస రాజ్యాల పట్ల, యుద్ధంలో ఓడిపోయిన దేశాల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఇంగ్లండును ఓడించి బర్మాను కొంతకాలం తమ అధీనంలో వుంచుకున్నపుడు ఎంత హింస జరిపేవారో రంగనాయకమ్మగారి ''బలిపీఠం'' నవల చదివితే తెలుస్తుంది.  

1942 క్విట్‌ ఇండియా ఉద్యమం విజయవంతమై వుంటే కూడా యిలాగే జరిగేది. ఆ సమయంలో కాంగ్రెసు నాయకులు తీసుకున్న తప్పుడు (నా దృష్టిలో) నిర్ణయమది. రష్యా యుద్ధంలోకి దిగేదాకా కమ్యూనిస్టులు దాన్ని సమర్థించారు. అదీ తప్పే (నా దృష్టిలో) యుద్ధసమయంలో కొత్త ప్రాంతాలు గెలుచుకుంటారు కానీ, వున్నవి ఎవరూ వదులుకోరు. ఇండియా వంటి పెద్ద దేశాన్ని జపాన్‌ పాలు చేస్తే సగం ఆసియాను శత్రువులకు ధారాదత్తం  చేసినట్లే. అందువలన స్వాతంత్య్రయోధులు 'క్విట్‌' అంటే వాళ్లు క్విట్‌ అవరు. అవలేదు. ఆ ఉద్యమమంతా వృథా అయింది. యుద్ధంలో గెలిచాకనే బ్రిటన్‌లో అధికారం చేతులు మారి లేబర్‌ పార్టీ గద్దె కెక్కిన తర్వాత వాళ్ల విధానం ప్రకారం మనకు స్వాతంత్య్రం యిచ్చారు. అదే యుద్ధంలో అక్షరాజ్యాలు నెగ్గి వుంటే మనను జపాన్‌వారు వలసరాజ్యంగా చేసుకుని ఓ పట్టాన వదిలిపెట్టేవారు కారు.  

మనం యిప్పుడు ఏం వ్యాఖ్యానించినా, 'విత్‌ ద బెనిఫిట్‌ ఆఫ్‌ హైండ్‌సైట్‌' సింహావలోకనం చేసుకునే సౌకర్యంతో అంటున్నాం. యుద్ధభూమిలో వుండగా ఏ స్ట్రాటజీ ఫలిస్తుందో, ఏది ఫలించదో ఎవరికీ తెలియదు. కృష్ణుడు జరాసంధుడితో పోరాడినప్పుడు అనేకసార్లు పారిపోయాడు. (ఆయన బిరుదుల్లో ఒకటి రణ్‌ఛోడ్‌) భీమార్జునుల బలం చేకూరాక అప్పుడు జరాసంధుణ్ని మట్టుపెట్టాడు. శివాజీ నిరంతరం ఔరంగజేబుతో పోట్లాడలేదు. మధ్యమధ్యలో రాజీ పడ్డాడు. పురందర్‌ సంధి చేసుకున్నాడు. అతని చక్రవర్తిత్వాన్ని అంగీకరిస్తానని లేఖ రాశాడు. బిజాపూర్‌ నవాబుకి, మొగలాయీలకు యుద్ధం జరిగితే మొగల్‌ సైన్యాలకు మద్దతుగా తన సైన్యాన్ని పంపాడు. ఇలా చేశాడు కాబట్టి శివాజీని మహారాష్ట్ర ద్రోహి అని, ఔరంగజేబుకి తొత్తు అనీ అనగలమా?  

క్విట్‌ ఇండియా ఉద్యమం నడిపి, భారత స్వాతంత్య్రానికి అనుకూలంగా వున్న ఇంగ్లీషువారికి యిబ్బందులు తెప్పించి, స్వాతంత్య్రం రావడం మరింత ఆలస్యం చేశారు కాబట్టి కాంగ్రెసు వారిని దేశద్రోహులని అనకూడదు, ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్లనూ అనకూడదు. ఒక్కోరికి ఒక్కోమార్గం సబబుగా తోస్తుంది. యుద్ధానంతరం కూడా మీరు వెళ్లిపోకండి, యిక్కడే వుండండి అని బ్రిటిషు వాళ్లను కాంగ్రెసు వాళ్లూ బతిమాలలేదు, కమ్యూనిస్టులూ బతిమాలలేదు, హిందూ మహాసభవాళ్లూ బతిమాలలేదు, ముస్లిం లీగు వాళ్లూ బతిమాల లేదు. అందుచేత వీళ్లెవరినీ దేశద్రోహులనడానికి లేదు. దేశద్రోహులైనా, దేశోద్ధారకులైనా భారతరాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన పార్టీల గురించి కొంతైనా తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఎవరి అవగాహన ప్రకారం వారు ఒక అభిప్రాయానికి రావచ్చును. ఈ లోగా అరకొర సమాచారంతో తొందరపడ నక్కరలేదు. 

రష్యాలో 1917 లో జారిస్టు వ్యతిరేక విప్లవం జరిగి, అంతర్యుద్ధం జరిగి 1922 లో బోల్షివిక్‌లు గెలిచి యుఎస్‌ఎస్‌ఆర్‌ ఏర్పరచి కార్మిక విప్లవం విజయవంతం చేశాక యితర దేశాల్లోని శ్రామికవర్గ నాయకులకు కూడా ఆశ పుట్టింది. ధనికవర్గాలకే కాదు, వలసరాజ్యాలేలుతున్న సామ్రాజ్యవాదులకు కూడా భయం పుట్టింది. ఇలాటి ఆలోచనలు రాకుండా మొగ్గలోనే తుంచేయాలని ప్రయత్నాలు చేశారు. రష్యాకు చాలా బాలారిష్టాలున్నాయి. హిట్లర్‌ ఎదుగుతున్న కాలంలో బ్రిటన్‌ అతన్ని ప్రోత్సహించింది - రష్యాపై పడి దాని పీడ వదులుస్తాడన్న ఆశతో. స్టాలిన్‌తో నిర్యుద్ధ సంధి చేసుకుని తనపైనే బ్లిట్జ్‌క్రీగ్‌ పేరుతో హఠాత్తుగా విమానదాడి జరపడంతో ఉలిక్కిపడింది. రష్యా నాయకులకు యివన్నీ తెలుసు. యావత్‌ ప్రపంచంలో తమది ఏకైక కమ్యూనిస్టు రాజ్యం. తక్కినవి రాజరికంలో, సైనిక నియంతృత్వంలో, వలస పాలనలో వున్నాయి. అతి కొద్ది రాజ్యాలు ప్రజాస్వామ్యంలో వున్నాయి. అందరూ కలిసి తమను అణగదొక్కకుండా చూసుకోవాలంటే అన్ని దేశాల్లో తమ ఆలోచనా విధానంతో ఏకీభవించే నాయకులు బలపడాలని తలపోసింది. అన్ని దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ శాఖలు ఏర్పడాలని ప్రణాళికలు రచించి, వారికి ఆర్థిక, హార్దిక సహాయం చేసింది. చైనా వంటి అనేక దేశాల్లో కమ్యూనిజం రావడానికి రష్యా సహకారమే కారణం. పరాయిదేశాల్లో కమ్యూనిజం వ్యాప్తికోసం ఖర్చు పెట్టే క్రమంలో సొంత ప్రజల కడుపు కాల్చడంతో, వాళ్లు కొంతకాలానికి తిరగబడ్డారు. అది తర్వాతి కథ. (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 26-Nov-2014 17:41:16 GMT

ఎమ్బీయస్‌ : సిపిఎం ఆవిర్భావం - 06

సిపియం పార్టీ ఆవిర్భావం అని హెడ్డింగ్‌ పెట్టి ఏదేదో రాస్తూ నేను దారితప్పానని ఒక పాఠకుడు అంటున్నారు. నేను దారి తప్పలేదు, దారి వేస్తున్నాను. ఫలానా సమావేశములో తీసుకున్న తీర్మాన ఫలితముగా, ఫలానా తేదీన, ఫలానా చోట, ఫలానా వారు సెక్రటరీగా ఆ పార్టీ ఆవిర్భవించెను అని ఒక పేజీ ఆర్టికల్‌ కూడా రాయవచ్చు. పాఠకుడికి అది ఏ వికీపీడియాలోనో దొరుకుతుంది. నా కాలమ్‌ దాకా రావడం దేనికి? చాలామంది తెలుగు జర్నలిస్టుల్లా పూర్వాపరాలు చెప్పకుండా, న్యూస్‌ ఏజన్సీ నుంచి వచ్చిన ఆ నాటి వార్తను యథాతథంగా యిచ్చేయడం నాకు నచ్చదు. అడుగు పొడుగులేని బిడ్డ ఆవిర్భవించాలన్నా చాలా కథ నడవాలి. తొమ్మిది నెలల క్రితమే బీజం పడాలి. అలా పడడానికి కూడా యిద్దరు వ్యక్తుల మధ్య ఒక భౌతిక చర్య జరగాలి. ఆ చర్యకు మందు వారిద్దరి మధ్య రసాయనికం (కెమిస్ట్రీ) వుండాలి. మనసుల్లో రసస్పందన కలగాలి. మొదటి భౌతిక చర్యకే ఫలితం రాదు, ఎప్పటికో అప్పటికి అన్నీ కుదురుతాయి. ఆ తర్వాత పుట్టబోయే బిడ్డకు అన్నీ అడ్డంకులే. ఎప్పుడు జారిపోతాడో, ఎప్పుడు అడ్డం తిరుగుతాడో తెలియదు. పెద్ద ప్రాణి తినకూడదనిది తిన్నా యీ ప్రాణి ఉసురు నిలవదు. తొమ్మిది నెలల తర్వాత బయటపడడం కూడా అతి క్లిష్టంగా ఒక్కోప్పుడు యిద్దరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఒక బిడ్డ పుట్టుకకే యింత రామాయణం వుంటే, లక్షలాది సభ్యులున్న పార్టీ పుట్టడానికి ఎంత మహాభారతం జరిగి వుంటుంది?  

అదేమీ చెప్పకుండా ఆయనలా ఓ నాలుగు పేర్లు వల్లిస్తే అర్థమవుతుందా? వారిలో ఎంతమంది పాఠకులకు తెలుసు? వారి గురించి, వారి వ్యక్తిత్వాల గురించి కాస్తయినా చెప్పవద్దా? లేకపోతే వారంతా దేశద్రోహులని యీయన లాగే వాళ్లూ అనుకుని తీర్మానించేస్తే...? చైనాకు మ్యాప్‌లమ్మారని ఆయనంటున్న సిపిఎం కాలగతిలో బలపడి, సిపిఐ బలహీనపడడాన్ని వాళ్లు ఎలా అర్థం చేసుకోవాలి? భారతప్రజలు దేశద్రోహులను ప్రోత్సహించే రకం అనుకోవాలా? ఆయన సమాచారం సరైనదా? సమగ్రమైనదా? ఎ కె గోపాలన్‌, డాంగే పక్షాన వున్నారని ఆయన రాశారు. ఢిల్లీలో సిపిఎం కార్యాలయానికి గోపాలన్‌ (ఎకెజి) పేరే పెట్టారు. అంటే వాళ్లు డాంగే అనుచరుడి పేర బిల్డింగు కట్టారా? '1962లో డాంగే ముఠా పార్టీ నాయకత్వం చేపట్టి యంత్రాంగాన్ని వారి అధీనంలోకి తెచ్చుకున్నాక  పార్టీ నిర్మాణ సూత్రాలను గాలికి వదిలేసి, తన సొంత విధానాలను పార్టీ మీద రుద్దేందుకు డాంగే ప్రయత్నం చేశాడు... తనతో విభేదిస్తున్న అతివాదులకు వ్యతిరేకంగా రాయమని కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేక పత్రిక అయిన 'పేట్రియాట్‌' వారపత్రికకు డాంగే 30 వేల రూపాయలను విరాళంగా దారుణం...' అంటూ గోపాలన్‌ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆయన 1964 డిసెంబరులో అరెస్టయ్యారు కూడా.  

ఇవన్నీ అక్కడక్కడ మెరుపుల్లా చెపితే పాఠకుల్లో అధికాంశం గందరగోళ పడతారు. ఏవో కొన్ని మాటలు, పేర్లు చెవిన పడి ఎవరెవరో స్పష్టంగా తెలియని సాధారణ పాఠకుడు - నా లక్ష్యం. అతని కోసమే నేను ఏదైనా సరే, తీరికగా, ఓపికగా, సరళమైన శైలిలో చెప్తాను. కమ్యూనిజం గురించి, సోషలిజం గురించి చదవాలంటే ఆ తాలూకు పుస్తకాల్లో అంతా గులకరాళ్ల భాష. పది పేజీలు చదివేసరికి తలనొప్పి ప్రారంభమౌతుంది. ఏవేవో సాంకేతిక, పారిభాషిక పదాలు, సంక్లిష్టమైన వాక్యనిర్మాణం, ఎక్కడెక్కడివో 50, 70 ఏళ్ల క్రిందటి ఉదాహరణలు. చరిత్ర కాస్తయినా తెలిస్తే తప్ప ఆ కాన్సెప్టు అవగాహనలోకి రాదు. అవన్నీ నేను అనుభవిస్తుంటాను కాబట్టి, సోదరపాఠకుడికైనా ఆ అవస్థ తప్పిద్దామని చూస్తూంటాను. ఎంత సింపుల్‌గా చెప్పగలనా అని చూసుకుంటూ, వాక్యాలు తిరగరాస్తూ వుంటాను. ఏదైనా సంఘటన జరగగానే వెంటనే వార్తగా రాసేసేది రిపోర్టరు. నేను రిపోర్టరును కాను. కొంతమంది అది అర్థం చేసుకోకుండా అది రాయలేదేం, యిది రాయలేదేం అంటారు. సంఘటన జరిగిన తర్వాత పదిమందీ రిపోర్టు చేసినది, వ్యాఖ్యానించినదీ చూసి, మొత్తం నా మెదడులో సమన్వయం చేసుకుని, పూర్వజ్ఞానంతో అనుసంధానం చేసుకుని అప్పుడు రాయడానికి పూనుకుంటాను. సమయాభావం వలన అనుకున్నవన్నీ రాయలేను, అనుకున్న సమయంలోనూ రాయలేను.  

ఇంత శ్రమ పడాలంటే ఆ అంశం నాకు మనసుకు హత్తుకోవాలి. అందరూ చెప్పగా మిగిలినదేదో వుంది, దాన్ని నేను పాఠకులతో పంచుకోవాలి అనుకున్న సబ్జక్ట్‌పైనే నేను కసరత్తు చేస్తాను. మీడియా అరగదీసేసిన వార్తను మళ్లీ రాయడంలో నాకు మజా వుండదు. అది గ్రహించనివాళ్లు మీరు కావాలని ఫలానా సబ్జక్ట్‌ వదిలేశారు, ఫలానాదాన్నే పట్టించారు అంటూ వుంటారు. ఈ కమ్యూనిజం సీరీస్‌ విషయంలో యిప్పటికే అన్నీ చదివేసి, స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకున్న సీనియర్‌ పాఠకులకు నా వివరణ సహజంగానే బోరు కొడుతుంది. అందువలన సీరీసంతా అయిపోయిన తర్వాత వాళ్లు పైపైన అలాఅలా బులబులాగ్గా పేజీలు తిప్పేసి, నేనెక్కడైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపి, తాము ఎక్కడైనా పొరబడి వుంటే సవరించుకుంటే అందరికీ హాయి.  

ఏ నాయకుడినైనా సరే దేశద్రోహి అనడం తప్పు. దేశం బాగుపడాలనే ప్రతివాడికీ అనిపించినా, దానికి మార్గం ఏమిటన్నదానిపై భేదాలు వుండవచ్చు. బ్రిటిషువాళ్ల పరిపాలన యింకా కొనసాగాలని అనుకున్నవాళ్లందరూ దేశద్రోహులే అంటే అనేకమందిని ఆ క్యాటగిరీలో పెట్టాల్సివస్తుంది. భారతీయుల్లో పరిణతి యింకా రాలేదు కాబట్టి అప్పుడే స్వాతంత్య్రం వద్దని కొందరన్నారు, సంఘసంస్కరణలను ప్రోత్సహిస్తున్న ఆంగ్లేయులు వెళ్లిపోతే ఛాందసవాదులు విజృంభిస్తారని కొందరు, మెజారిటీగా వున్న హిందువులు తమను వేధిస్తారని మైనారిటీలు, అగ్రవర్ణస్తులు తమను అణగదొక్కుతారని దళితులు, స్వాతంత్య్రం వచ్చాక అధిక అక్షరాస్యతతో అప్పటికే ఉద్యోగాల్లో, రాజకీయనాయకత్వంలో అగ్రస్థానంలో వున్న బ్రాహ్మణుల సారథ్యంలో నడుస్తున్న కాంగ్రెసుకి అధికారం దక్కుతుందని భయపడిన బ్రాహ్మణేతర అగ్రవర్ణాలు, సోషలిజం ప్రవచిస్తున్న కాంగ్రెసు అధికారంలోకి వస్తే భూసంస్కరణలు అమలు చేస్తుందన్న భయంతో భూస్వాములు, సంస్థానాధీశులు... యిలా అనేక వర్గాలలోని అధికాంశం ప్రజలు రకరకాల కారణాలతో ఆంగ్లేయులు కొనసాగాలని కోరుకున్నారు. జస్టిస్‌ పార్టీ స్థాపించారు. తర్వాతి కాలంలో కాంగ్రెసు పార్టీలో లేక యితర పార్టీల్లో చేరి, పదవులు అనుభవించిన అనేకమంది యీ జస్టిస్‌ పార్టీకి సారథులు, మద్దతుదారులు. గాంధీగారి పిలుపు మేరకు చాలామంది ప్రభుత్వోద్యోగాలు వదిలేశారు. కొంతమంది ఉద్యోగాలలోనే కొనసాగి, ప్రజలకు ఉపయోగపడే అనేక పనులు చేశారు. వాళ్లను తిట్టాలా? 1947కు ముందు పోలీసు సర్వీసులో, సైన్యంలో చేరినవాళ్లందరూ బ్రిటిషువారి ప్రయోజనాలను కాపాడినట్లే అనుకుని వాళ్లందరికీ ద్రోహుల ముద్ర కొట్టాలా? (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 22-Nov-2014 22:00:00 GMT

ఎమ్బీయస్‌ : సిపిఎం ఆవిర్భావం - 05

సోషలిజం కాన్సెప్ట్‌ వచ్చాక సహకార పద్ధతి, కో-ఆపరేటివ్‌ సిస్టమ్‌ గురించి ఆలోచనలు చేశారు. నిజానికి అది చాలా మంచి యోచన. పదిమంది కలిసి పని చేసి, పదిమందీ లాభపడవచ్చు. లాభమైనా, నష్టమైనా పంచుకుంటారు. చాలా దేశాల్లో యిది సక్సెసైంది. మన దేశంలో కూడా కోపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలు, పాల సొసైటీలు, వ్యవసాయ కమిటీలు, కోఆపరేటివ్‌ సూపర్‌ మార్కెట్లు, కోఆపరేటివ్‌ బ్యాంకులు... యిలా చాలా నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో యిది విజయవంతంగా నడుస్తోంది. కొన్ని చోట్ల విఫలమైంది. విఫలం కావడానికి ముఖ్యకారణం తెలుసుకోవాలంటే ''ఉమ్మడి గేదె పుచ్చి చచ్చింది'' అనే సామెత గుర్తు తెచ్చుకోవాలి. పక్కవాడు గడ్డి వేస్తాడులే అనుకుంటూ ప్రతీవాడూ పాలు పిండుకుంటూంటే గేదె ఎలా బతుకుతుంది? ఎప్పటికైనా కోపరేటివ్‌ రంగం బలపడినప్పుడే దేశం బాగుపడుతుంది. అయితే ఆ సొసైటీని నడపడానికి ఒక పాలక కమిటీ అంటూ కావాలి. దానిలో స్వార్థపరశక్తులు చొరబడి, తన వాళ్లకు ఋణాలు యిప్పించుకుని, సొసైటీని సొంత ఆస్తులుగా భావించి దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్లకు రాజకీయ పార్టీల మద్దతు వుంటోంది కాబట్టి వాళ్ల ఆటలు సాగి, సొసైటీ కుప్పకూలి, ప్రజలకు సహకారంపై విశ్వాసం పోతోంది. ఇలా ఏ వ్యవస్థ చూసినా అపసవ్యంగానే, లోపభూయిష్టంగానే కనబడుతోంది. దాన్ని నడిపించేవాడి సామర్థ్యంలో, నిజాయితీలో వున్న బలం బట్టి ఒక్కో చోట ఒక్కో వ్యవస్థ బాగా పనిచేస్తోంది. చైనాలో కమ్యూనిజం పేర నడుస్తున్నది కమ్యూనిజం కానే కాదు. వాళ్ల విధానాలు చూస్తే మన దేశంలో కాంగ్రెసు ఏమందో, అక్కడ కమ్యూనిస్టు పార్టీ కూడా అదే చేసింది. తేడా అల్లా వాళ్లు ప్రభావవంతంగా, పక్కాగా చేశారు. అడ్డు వచ్చినవాళ్లను తొలగించేశారు. ఇక్కడ ఏదీ సరిగ్గా చేయక తగలేశారు.   

ప్రపంచంలో ఏ దేశంలోనైనా శ్రామిక, కార్మిక, రైతుకూలీ వర్గాలకు మేలు చేస్తామనే నినాదంతో బడుగు వర్గాల ప్రతినిథిగా కమ్యూనిస్టు పార్టీలు ముందుకు రాగానే, ఆ మార్పు రాకుండా చూడడానికి అనేక పార్టీలు అడ్డు తగులుతాయి. ఇంతకుముందు చెప్పినట్లు అవి రకరకాల, ఆకర్షణీయమైన నినాదాలతో ముందుకు వస్తాయి. కొన్ని మతపరంగా వుంటాయి, కొన్ని సామ్యవాదం పేరు చెప్తాయి, మరి కొన్ని ఎమోషనల్‌ యిస్యూలతో ముందుకు వస్తాయి. ఆ యా పార్టీలకు కొంతకొంతమంది సమర్థకులు వుంటారు. ఓటింగులో వాళ్లకు కూడా గణనీయమైన శాతం వాటా వుంటుంది. ఎన్నికల ద్వారా అధికారంలోకి వద్దామనుకున్న కమ్యూనిస్టు పార్టీ ఆ యా పార్టీలతో చేతులు కలపక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. డెమోక్రాటిక్‌, సోషలిస్టు.. అనే ట్యాగ్‌లు తగిలించుకున్న పార్టీలతో కమ్యూనిస్టు పార్టీలు చేతులు కలపడం, ఆ తర్వాత కత్తులు దూయడం జరుగుతూనే వుంటుంది. మతాన్ని రాజకీయాలను కలపకూడదని వాదించే కమ్యూనిస్టులో ఒక్కో దేశంలో మతపరమైన పార్టీలతో కూడా పొత్తు కుదుర్చుకుంటూ వుంటారు. మన దేశంలో కూడా కేరళలో ముస్లిం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. దీన్ని సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులు ఎలా సమర్థించుకుంటారన్నది ఆసక్తికరమైన విషయం.  

ప్రజాస్వామ్యంలో తగినన్ని సీట్లు రాకపోతే అధికారం కోసం ఎవరైనా ఎవరితోనైనా చేతులు కలుపుతూ వుంటారు. బిజెపికి రామమందిరం, ఆర్టికల్‌ 370 యిత్యాది విషయాలపై కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆ విషయాలలో టిడిపి వారితో ఏకీభవించదు. అయినా యిద్దరూ చేతులు కలిపారు. 2014లో బిజెపికి తగినన్ని సీట్లు వచ్చాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నానాగోత్రీకులతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచ వలసి వచ్చేది. మమతా బెనర్జీ, జయలలిత, మాయావతి వంటి వారి సాయం తీసుకోవలసి వచ్చేది. వారిలో ఎవరికీ రామమందిరం కట్టాలన్న పట్టుదల లేదు. బలమైన ఒక ఉమ్మడి శత్రువును ఓడించడానికి ఎవరితోనైనా చేతులు కలపాలి, తర్వాత పొత్తులోంచి బయటపడి వీరిని తప్పించి మనం బలపడాలి - అనేది లెనిన్‌ దగ్గర్నుంచి అందరూ ఆచరించే సిద్ధాంతం. 2014 పార్లమెంటు ఎన్నికలలో బిజెపి, శివసేనతో కలిసి కాంగ్రెస్‌, ఎన్‌సిపిలను ఓడించింది. అసెంబ్లీ ఎన్నికల వద్దకు వచ్చేసరికి శివసేన పొత్తులోంచి బయటపడి దాన్ని బలహీనపరచింది. అవసరార్థం గతంలో శత్రువుగా వున్న ఎన్‌సిపి సాయం తీసుకుంది. కొంతకాలానికి ఎన్‌సిపి బలపడితే దాన్ని తగ్గించడానికి మరొకరి సాయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు. జార్‌ చక్రవర్తిని గద్దె దింపడానికి అన్ని వర్గాల వారూ కలిసికట్టుగా భుజం భుజం కలిపారు. ఆ తర్వాత వారిలో విభేదాలు వచ్చాయి. బోల్షివిక్‌లు, మెన్ష్‌విక్‌లుగా విడిపోయారు. కొంతకాలానికి బోల్ష్‌విక్‌ విప్లవం జరిగి మెన్ష్‌విక్‌లను మట్టుపెట్టి అధికారంలోకి వచ్చారు.  

దీన్ని మన భారతదేశానికి అన్వయించి చూదాం. ఇంగ్లీషు పాలనకు వ్యతిరేకంగా భిన్న సిద్ధాంతాలున్న రాజకీయ పార్టీలు కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాయి. ఆంగ్లేయులు వెళ్లిపోతే రామరాజ్యం వస్తుందని కొందరు, కార్మికరాజ్యం వస్తుందని మరి కొందరు, అణగారిన కులాలకు మంచి జరుగుతుందని యింకొందరు, పాతకాలం రాజుల, జమీందారుల పాలన మళ్లీ వస్తుందని కొంతమంది, అందరికీ సమానావకాశాలు వస్తాయని మరి కొంతమంది.. యిలా రకరకాల ఉద్దేశాలతో పోరాటం చేశారు. చివరకు కాంగ్రెసుకి అధికారం సిద్ధించింది - ఉద్యమానికి నాయకత్వం వహించింది కాబట్టి, అత్యధికులు దాన్ని బలపరిచారు కాబట్టి. స్వాతంత్య్రం రావడానికి ముందే యిది స్పష్టమైంది. ఎప్పటికైనా ఆంగ్లేయుల నిష్క్రమణ అంటూ జరిగితే ప్రభుత్వాన్ని నడపబోయేది కాంగ్రెసే కాబట్టి దాని విధానాలు తమకు అనుకూలంగా వుండాలని రైటిస్టుల నుంచి లెఫ్టిస్టుల దాకా, మతవాదుల నుండి నాస్తికుల దాకా అందరూ ప్రయత్నించారు. ఆ పార్టీలో చేరో, బయట నుండి ఒత్తిడి చేసో దాని విధానాలు మార్చాలని చూశారు. అందుకే ఏ పార్టీ  నాయకుణ్ని చూసినా మొదట కాంగ్రెసులో చేరి, దాని ద్వారా పేరు తెచ్చుకున్నట్లు కనబడుతుంది.  

గాంధీ నాయకత్వాన కాంగ్రెసు బలపడుతున్న కొద్దీ దానితో ఎలా వేగాలన్న సమస్యే కమ్యూనిస్టు పార్టీని వేధించింది. గాంధీ తర్వాత స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెసుతో ఎలా వ్యవహరించాలన్న అంశమే ప్రధాన ప్రతిపక్షంగా వున్న కమ్యూనిస్టు పార్టీని చీల్చింది. అధికారంలో వున్న పార్టీ చీలిందంటే ఒక వ్యక్తి స్వార్థం కారణం కావచ్చు. ప్రతిపక్షంలో వున్న పార్టీ చీలిందంటే అహంకారం కారణం కావచ్చు. కమ్యూనిస్టు పార్టీ సైద్ధాంతికపరమైన సమస్యలతో చీలి 50 ఏళ్ల క్రితం సిపిఎం ఏర్పడింది! ఈ సైద్ధాంతిక సందిగ్ధతకు నేపథ్యమేమిటో తెలుసుకొనకపోతే పార్టీ చీలిక అర్థం కాదు. ఇందుకే యింత విపులంగా చెప్పవలసి వచ్చింది. (సశేషం)  
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014) 
mbsprasad@gmail.com
source: www.greatandhra.com
Published Date : 21-Nov-2014 07:24:13 GMT